Hydraa: హైదరాబాద్ బోడుప్పల్లో 30 ఏళ్లుగా ఉంటున్నారా..? ఇళ్ల కూల్చివేతలపై కమిషనర్ క్లారిటీ

Hydraa: హైదరాబాద్ బోడుప్పల్లో 30 ఏళ్లుగా ఉంటున్నారా..? ఇళ్ల కూల్చివేతలపై కమిషనర్ క్లారిటీ

హైదరాబాద్ బోడుప్పల్ లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాల్లో FTL పరిధిలో ఉన్న ఇళ్లను కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 2025 నవంబర్ 15వ తేదీన బోడుప్పల్ లోని సుద్దకుంట చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమీషనర్.. స్థానికుల ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా హైడ్రా అంటే ఎలాంటి భయం వద్దని స్థానికులకు ధీమా ఇచ్చారు. 

సుద్దకుంట చెరువు వద్ద FTL పేరుతో HMDA, మున్సిపల్ అధికారులు తమ ఇండ్లకు మార్కింగ్‌ చేసి భయపెడుతున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇళ్లపై నెంబర్లు, ఇనుప కడ్డీలు పెట్టి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నారని విన్నవించారు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.. ఇప్పుడు ఎందుకు FTL సమస్య వచ్చిందని విన్నవించారు. దీంతో ఇళ్లపై చేసిన మార్కింగ్‌ ను చూసి కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మార్కింగ్ చేసిన అధికారులపై చర్యలకు సిఫార్సు చేశారు. 

పాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ ప్రకారమే చెరువు హద్దులు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. 30 ఏళ్ల పాత ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదంటు స్పష్టమైన హామీ ఇచ్చారు. హైడ్రా పేరిట వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇళ్లపై చేసిన మార్కింగులు వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించారు. 

హైడ్రా కమిషనర్ ఆదేశాలతో  హెచ్‌ఎండీఏ అధికారులు మార్కింగులు తొలగించారు. మార్కింగ్స్ తొలగించి తమకు ఊరట కల్పించినందుకు ఈ సందర్భంగా ప్రజలు కమిషనర్ కు ధన్యవాదాలు తెలిపారు. సుద్దకుంట చెరువు అభివృద్ధి, బాక్స్ డ్రెయిన్ పనులకు సిఫార్సు చేశారు కమిషనర్ రంగనాథ్.