- ఓఎన్‌జీసీ నుంచి రిలయన్స్ కొట్టేసిందని ఆరోపణ
- విలువ రూ.14 వేల కోట్లు
న్యూఢిల్లీ: ఆంధ్రా కేజీ బేసిన్‌లోని ఓఎన్‌జీసీకి చెందిన నేచురల్ గ్యాస్‌ను దొంగిలించిందనే ఆరోపణలపై బాంబే హైకోర్ట్ ముకేశ్ అంబానీతో సహా రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. 1.55 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14 వేల కోట్ల) విలువైన గ్యాస్‌ను దొంగిలించారని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఒక పిటిషన్ కోర్టులో దాఖలైంది.
అలానే దీనిపై వడ్డీ కింద రూ.1,540 కోట్లను చెల్లించాలని డిమాండ్ చేసింది. దీనికి స్పందనగా హైకోర్టు రిలయన్స్‌కు నోటీసులు ఇష్యూ చేసింది. నోటీసుల జారీ చేసినంత మాత్రాన రిలయన్స్ తప్పు చేసిందని కాదని కోర్ట్ తెలిపింది.
రిలయన్స్‌పై సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చెపట్టాలా? ఆస్తులేమైనా సీజ్ చేయాలా? అనే అంశాలను సీబీఐ, కేంద్రం పరిశీలించాలని ఆదేశించింది. రిలయన్స్ 2004 నుంచి 2014 మధ్య కేజీ డీ6 బ్లాక్స్‌ను విపరీతంగా తవ్వడంతో ఓఎన్‌జీసీ నార్తర్న్ ఫీల్డ్స్ నుంచి గ్యాస్ బయటకు పోయిందని పిటిషనర్ ఆరోపించగా, గ్యాస్ ఒకచోట ఉండదని, సహజంగానే బ్లాక్ సరిహద్దులను దాటుతుందని రిలయన్స్ పేర్కొంది.
