అపజయం ఎరుగని రాజమౌళి సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణం.. అతని తండ్రి, కథ రచయిత, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ (Vijeyendra Prasad). ప్రస్తుతం జక్కన్న తెరకెక్కిస్తున్న మహేష్ బాబు మూవీకి సైతం విజయేంద్ర ప్రసాద్ తనదైన కథను అందించారు. ఈ సారి ప్రపంచంతో మాట్లాడనున్నారు. అంతకుముందుగా గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ లో మాట్లాడి సినిమాపై భారీ హైప్ పెంచారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ మాటల్లో..‘‘ఈ సినిమా తాలూకు 30 నిమిషాల యాక్షన్ సీన్ చూసి మంత్రముగ్ధుడిని అయిపోయా. మహేష్ బాబు నట విశ్వరూపం చూస్తారు. అందులో మహేష్ నటనను అలా చూస్తూ ఉండిపోయా. ఎటువంటి CG లేదు, డబ్బింగ్ లేదు, రీ రికార్డింగ్ లేదు.. అయినా నన్ను మంత్రముగ్ధుడిని చేసింది. మరిచిపోలేని అద్భుత అనుభూతి ఇచ్చింది. సాధారణంగా.. కొన్ని సినిమాలు మనుషులు తెరకెక్కిస్తారు. కొన్ని మాత్రం దైవ నిర్ణయం.
రాజమౌళి గుండెపై హనుమ ఉన్నాడు. ఏం చేయాలో చెబుతూ వచ్చాడు. కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు. హనుమకు రామనామం ఇష్టం. ఆయన ద్వారా మాకు ఈ ప్రాజెక్టు వచ్చింది. రాముడు వారధి కడితే ఉడతా భక్తిగా కొందరు రాళ్లు ఎలా అందించారో.. అలాగా మాకు ఈ సినిమా ద్వారా మాటలు అందించిన దేవా కట్టా, మ్యూజిక్ కీరవాణి, PS వినోద్ సినిమాటోగ్రాఫర్ వంటి టెక్నీషియన్స్తో ఈ అదృష్టం కలిగింది’’ అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
అయితే, ఇప్పటివరకు మహేష్- రాజమౌళి సినిమా కథ ఇదేనంటూ చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కానీ, విజయేంద్రప్రసాద్ స్పీచ్ తో కథను రివీల్ చేశాడు. 'అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమాన్ ఉన్నాడు.. ఊపిరితో కర్తవ్యం బోధిస్తున్నాడు. హనుమకు రామనామం ఇష్టం’ అంటూ సినిమా బ్యాక్ డ్రాప్ హనుమాన్ అని చెప్పకనే చెప్పాడు విజయేంద్రప్రసాద్.
