హైదరాబాద్ : రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 152 ఆర్టీసీ అద్దె బస్సులను మండల మహిళా సమాఖ్యలు విజయవంతంగా నిర్వహిస్తున్నా యి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో మరో 448 అద్దె బస్సులను మహిళా సంఘాలకే అప్పగించేందుకు ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ నేపథ్యంలో సెర్ఫ్ సీఈఓ దివ్యా దేవరాజన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖ రాశారు. మండల మహిళా సమాఖ్యలు 448 బస్సుల కొనుగోలు పూర్తిచేసి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజే శారు.
అవసరమైన అనుమతులు మంజూరైన వెంటనే, ఆ బస్సులను ఆర్టీసీ అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ఆర్టీసీలో మహిళా సమాఖ్యల ద్వారా నడిచే బస్సుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఇందిరామహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు స్థిర మైన ఆదాయ మార్గాలను కల్పించడం లక్ష్యం గా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఒక్కో బస్సు ద్వారా మహిళా సంఘాలకు నెలకు సుమారు రూ.70 వేల వరకు అద్దె ఆదాయం లభించడం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలకంగా మారింది.
