జిల్లాల్లో ఇందిరమ్మ టవర్లు..తొలి దశలో నిజామాబాద్, వరంగల్‌‌లో నిర్మాణం

జిల్లాల్లో ఇందిరమ్మ టవర్లు..తొలి దశలో నిజామాబాద్, వరంగల్‌‌లో నిర్మాణం
  • టవర్ల నిర్మాణాలకు ఇప్పటికే స్థలాలు ఫైనల్‌‌
  • అన్ని జిల్లాల్లో హౌసింగ్ బోర్డుకు విలువైన జాగలు
  • తక్కువ ఖర్చుతో టవర్ల నిర్మాణం

హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్‌‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు జిల్లాల్లో టవర్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇందిరమ్మ టవర్స్‌‌ నిర్మాణానికి హౌసింగ్ బోర్డు కసరత్తు చేస్తోంది. తొలి దశలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో టవర్స్‌‌ నిర్మించనున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో టవర్స్ నిర్మించే స్థలాన్ని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌ రెడ్డి పరిశీలించారు. వరంగల్‌‌లో సైతం హౌసింగ్ బోర్డుకు ఐదున్నర ఎకరాల స్థలం ఉండటంతో ఇక్కడ టవర్లు నిర్మించనున్నారు. ఈ రెండు కార్పొరేషన్లలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి డీపీఆర్‌‌ను హౌసింగ్ బోర్డు అధికారులు సిద్ధం చేస్తున్నారు.

తగ్గనున్న నిర్మాణ వ్యయం..

హెచ్‌‌ఎండీఏ పరిధిలో ఇందిరమ్మ టవర్స్‌‌ను జీ ప్లస్ 10 ఫ్లోర్లలో నిర్మిస్తున్నారు. ఒక్కో టవర్‌‌లో ఒక్కో ఫ్లాట్ సుమారు 560 ఎస్ఎఫ్‌‌టీ చొప్పున 120 ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ నిర్మాణ వ్యయం రూ. 11 లక్షలు ఖర్చు అవుతోంది. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద లబ్ధిదారుడికి రూ. 5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండగా, మిగతా రూ. 6 లక్షలను 4 విడతల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, జిల్లాల్లో ఒక్కో ఫ్లాట్ రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ మినహాయిస్తే లబ్ధిదారుడు రూ.4 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం..

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్​ను ప్రభుత్వ స్థలాల్లో నిర్మిస్తున్నారు. మొత్తం 26 నియోజకవర్గాలు ఉండగా, 16 నియోజకవర్గాల్లో పనులు స్టార్ట్ అయ్యాయి. మరో 4 నియోజకవర్గాల్లో టెండర్లు ఫైనల్ కానున్నాయి. ఇందులో 21 నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డు భూముల్లోనే టవర్లను నిర్మిస్తున్నారు. నాంపల్లి నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్‌‌మెంట్ ల్యాండ్ కాగా, మరి కొన్ని నియోజకవర్గాల్లో రెవెన్యూ, ఇతర శాఖల స్థలాల్లో టవర్స్ నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.