పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్స్..కస్టమైజ్డ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్స్..కస్టమైజ్డ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
  • బుద్ధవనం, నేలకొండపల్లి, దూళికట్ట బుద్ధిస్ట్ ​సర్క్యూట్‌‌గా తీర్చిదిద్దుతాం
  • పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ‌‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్

హైదరాబాద్, వెలుగు: దేశం నలుమూల నుంచి వచ్చే పర్యాటకులతోపాటు విదేశీ టూరిస్ట్‌‌ల సేఫ్టీ, సౌకర్యాలపై స్పెషల్​ఫోకస్​పెట్టినట్టు పర్యాటక, భాషా సాంస్కృతికశాఖ‌‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో  దాదాపు1000 నుంచి 5000 వరకు టాయిలెట్స్, రెస్ట్​రూమ్స్​నిర్మించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్‌‌లో ఆమె మాట్లాడారు. హైదరాబాద్ సిటీ అంతర్జాతీయ వ్యాపార సదస్సులు, కాన్ఫరెన్స్‌‌లు, ఫ్యామిలీ వెకేషన్లు, సాంస్కృతిక పర్యాటకానికి ప్రధాన కేంద్రమని, పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగేలా ‘కస్టమైజ్డ్​టూరిజం’పై ఫోకస్​ పెట్టామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 250కిపైగా డెస్టినేషన్​ ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అత్యాధునిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. రాష్ట్రంలో వెడ్డింగ్​డెస్టినేషన్లకు డిమాండ్​ పెరుగుతుందని వివరించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు  నేరుగా హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​ సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. బుద్ధవనం, నేలకొండపల్లి, దూళికట్ట బౌద్ధక్షేత్రాలకు పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు.

వీటితోపాటు మరిన్ని ప్రాంతాలను ప్రత్యేక సర్క్యూట్‌‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అపారమైన హెరిటేజ్​ సంపద ఉందని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రంలో హోంస్టేలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని, ఆ దిశగా ఇంటి యాజమానులను ప్రోత్సహించాలని సూచించారు. ఇవి పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని, తక్కువ ఖర్చుతో కూడిన సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని చెప్పారు.