తెలంగాణలో కొత్తగా 10 నర్సింగ్ కాలేజీలు :మంత్రి దామోదర రాజనర్సింహ

తెలంగాణలో కొత్తగా 10 నర్సింగ్ కాలేజీలు :మంత్రి దామోదర రాజనర్సింహ
  • నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టు క్రియేట్ చేయనున్నట్టు వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా పది ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు, ఒక పీజీ  నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో నర్సింగ్ కౌన్సిల్ బలోపేతంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. జీఎన్ఎం పూర్తి చేసిన విద్యార్థులు తమ కెరీర్‌‌లో ఎదిగేందుకు వీలుగా, కాలేజీల్లో పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు అవకాశం కల్పించాలన్నారు.

రాష్ట్రంలో నర్సింగ్ కౌన్సిల్ నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ పోస్టును కొత్తగా క్రియేట్ చేయాలని మంత్రి ఆదేశించారు. మిడ్ వైఫరీ కోర్సులను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. కౌన్సిల్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే నర్సులు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆవరణలో సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.