
- స్థానిక ఎన్నికలు, రిజర్వేషన్లపై చర్చ
హైదరాబాద్, వెలుగు: బీసీలకు పెంచిన 42 శాతం రిజర్వేషన్లతోనే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ అన్నారు. ఈ నెల 8న బీసీ రిజర్వేషన్ల కేసును హైకోర్టులో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్ లోని మంత్రి పొన్నం నివాసంలో కాంగ్రెస్ బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, ఎంపీ అనీల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అనీల్ ఈరవత్రి పాల్గొని లోకల్ బాడీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చించారు. రిజర్వేషన్లపై న్యాయపరమైన అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు.
తమిళనాడులో తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయని మంత్రులు, పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు మూడు నెలలకు మించి పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా రిజర్వేషన్లు అమలు అవుతాయని పీసీసీ చీఫ్, మంత్రులు స్పష్టం చేశారు.