సర్కారు కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్.. మిడ్డేమీల్స్..జూన్ 12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 

సర్కారు కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్.. మిడ్డేమీల్స్..జూన్ 12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 

 

  • దోశ, పూరీ, వడ, మిల్లెట్ ఇడ్లీలతో మార్నింగ్ టిఫిన్స్ 
  • రాష్ట్రవ్యాప్తంగా1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థుల ఆకలి తీర్చేందుకు సర్కారు కొత్త స్కీంకు శ్రీకారం చుట్టింది. స్కూల్ విద్యార్థులకు అందించినట్టుగానే ఇంటర్ విద్యార్థులకూ ఈ ఏడాది నుంచి మిడ్డేమీల్స్ తో పాటు బ్రేక్ ఫాస్ట్ అందించాలని నిర్ణయించింది. ఈ స్కీంను జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనితో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఇంటర్‌ విద్యార్థులకు రెండు పూటలా పౌష్టికాహారం అందిస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

రాష్ట్రంలో 430 సర్కారు జూనియర్ కాలేజీలు ఉండగా, వాటిలో 1.92 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నేండ్లుగా ఇంటర్ విద్యార్థులకు మిడ్డేమీల్స్ అందించాలనే డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే గతేడాది ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు చేయగా, సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ పెట్టేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

గ్రామాలు, తండాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం పూట తినేందుకు సమయం లేక, మధ్యాహ్నం క్యారియర్ తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సర్కారు స్కూల్ విద్యార్థులకు అందించినట్టుగానే.. కాలేజీల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెనూ రూపొందించారు. దోశ, మిల్లెట్ ఇడ్లీ, పూరీ, బోండా, ఉప్మా తదితర వాటిని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల క్రింత ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష.. అధికారులు, ట్రస్టులతో సమావేశమై దీనిపై చర్చించారు.

విద్యార్థులకు అదనపు పోషకాల కోసం మిడ్డేమీల్స్, బ్రేక్ ఫాస్ట్ తో పాటు పాలు, రాగిజావా కూడా ఇవ్వాలని నిర్ణయించారు. వారంలో మూడు రోజులు పాలు, మరో మూడు రోజులు రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. 150 మిల్లీలీటర్ల పాలు, 250 మిల్లీలీటర్ల రాగిజావ ఇవ్వనున్నారు. దీనికోసం విజయ డైరీ, అన్నపూర్ణ ట్రస్టుతోనూ అధికారులు సమావేశమయ్యారు. ఇది కూడా బ్రేక్ ఫాస్ట్ స్కీంతో పాటు అమలు చేయనున్నారు. 

రూ.180 కోట్లతో స్కీం..

జాతీయ పోషకాహార సంస్థ  సిఫార్సుల ప్రకారం.. 15 నుంచి 18 ఏళ్లలోపు ఉండే విద్యార్థులకు శారీరక, మానసిక ఎదుగుదల చాలా ముఖ్యం. ఈ వయస్సు వారికి రోజుకు 1,029 కిలో కేలరీలు, 3,0-32 గ్రాముల ప్రోటీన్ అవసరం. అందుకే వారి డైట్‌లో ఐరన్, విటమిన్ లోపాలు రాకుండా మెనూను సిద్ధం చేశారు. దీంతో ముఖ్యంగా విద్యార్థినుల్లో రక్తహీనత సమస్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.180 కోట్లు కేటాయించింది. ఇందులో బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.80 కోట్లు, మధ్యాహ్న భోజనానికి రూ.వంద కోట్లు వెచ్చించనున్నారు. తొలి రోజున 64 కాలేజీల్లో 41,250 మంది విద్యార్థులకు ఈ పథకం ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెలాఖరు నాటికి అన్ని కాలేజీల్లో అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

బ్రేక్‌ఫాస్ట్ మెనూ ఇదే..

సోమవారం           దోశ + చట్నీ
మంగళవారం      మిల్లెట్ ఇడ్లీ + సాంబార్
బుధవారం            పూరీ + మిక్స్‌డ్             వెజిటెబుల్ కుర్మా 
గురువారం            బోండా + చట్నీ
శుక్రవారం            ఇడ్లీ + చట్నీ
శనివారం              ఉప్మా + చట్నీ/సాంబార్