త్వరలో యోగా పీజీ కోర్సులు ప్రారంభిస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ

త్వరలో యోగా పీజీ కోర్సులు ప్రారంభిస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ
  •     యోగాను జీవనశైలిలో భాగం చేసుకోండి : మంత్రి దామోదర

హైదరాబాద్, వెలుగు: త్వరలో యోగా పీజీ కోర్సులను ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 750 మంది యోగా ట్రైనర్లను నియమించి, 10 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్త ఆరోగ్య వారోత్సవాలను ఆయన శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి యోగాసనాలు వేశారు. ఆయుష్ డిపార్ట్‌‌‌‌మెంట్ ఏర్పాటు చేసిన స్టాల్స్‌‌‌‌ ను పరిశీలించారు. 

చికిత్స కంటే వ్యాధుల నివారణే మేలని, ప్రజలందరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని సూచించారు. 30 ఏండ్లు దాటిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు, 46 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.