సివిల్స్ ర్యాంకులే టార్గెట్‌‌‌‌..ఐదేండ్ల నుంచి ఎంపిక కాని ఎస్టీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్

సివిల్స్ ర్యాంకులే టార్గెట్‌‌‌‌..ఐదేండ్ల నుంచి ఎంపిక కాని ఎస్టీ స్టడీ సర్కిల్ స్టూడెంట్స్
  • ఢిల్లీ శ్రీరామ్‌‌‌‌కు కోచింగ్ బాధ్యతలు
  • వంద మంది పేద అభ్యర్థులకు ఉచిత శిక్షణ 

హైదరాబాద్, వెలుగు: పేద ఎస్టీ విద్యార్థులకు సివిల్స్ ర్యాంకులు సాధించే లక్ష్యంతో ట్రైబల్ శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తొలిసారిగా టెండర్ ద్వారా ఢిల్లీ శ్రీరామ్ సివిల్స్ స్టడీ సర్కిల్‌‌‌‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. దసరా సెలవుల తర్వాత నుంచి వచ్చే ఏడాది మేలో ప్రిలిమ్స్ పరీక్ష జరిగే వరకు 8 నెలల పాటు100 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అలాగే గతేడాది ప్రిలిమ్స్‌‌‌‌లో అర్హత సాధించిన మరో 20 మందికి మెయిన్స్ శిక్షణ ఉచితంగా అందించనుంది. దీని ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని సివిల్స్ ర్యాంకులు సాధించేలా గిరిజన యువతకు అంతర్జాతీయ స్థాయి మెంటార్‌‌‌‌షిప్, బోధన అందనుంది.

ఉచిత వసతి, స్టైఫండ్

రాజేంద్రనగర్‌‌‌‌లోని మానసహిల్స్‌‌‌‌లో ట్రైబల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కొనసాగుతోంది. ఏటా 100 మంది పేద ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందిస్తోంది. ఫ్రీ హాస్టల్, బుక్స్​కోసం ప్రత్యేకంగా స్టైఫండ్, నెలవారీ పాకెట్ మనీతో పాటు కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, రీడింగ్ హాల్ వంటి వసతులు కల్పిస్తోంది. ఒక్కో విద్యార్థిపై సుమారు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తోంది. అయితే గత ఐదేండ్ల నుంచి ప్రతి ఏటా  ఈ స్టడీ సర్కిల్ నుంచి 120 మంది సివిల్స్ ఎగ్జామ్ రాస్తుండగా ఇందులో కేవలం 10 మంది లోపే ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవుతున్నారు.

మెయిన్స్ లో మాత్రం ఒక్కరూ కూడా సెలక్ట్ కావటం లేదు.  దీంతో ఈ సారి ప్రైవేట్ స్టడీ సర్కిల్ కు కోచింగ్ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2017,-18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ స్టడీ సర్కిల్ ద్వారా ఇప్పటివరకు 734 మంది శిక్షణ పొందగా, 131 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. 

టెండర్లకు అనూహ్య స్పందన

పేద ఎస్టీ విద్యార్థులకు సివిల్స్ కోచింగ్ ఇచ్చేందుకు ట్రైబల్ శాఖ ఇటీవల టెండర్లను పిలిచింది. ఇందులో  ఆరు ప్రముఖ స్టడీ సర్కిళ్లు పాల్గొన్నాయి.  తక్కువగా కోట్ చేసిన ఢిల్లీ శ్రీరామ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెండర్ దక్కించుకుంది. ఒక్కో స్టూడెంట్ కు రూ. 60 వేలకే ప్రిలిమ్స్, మెయిన్స్ కోచింగ్ కు ఇచ్చేలా టెండర్ లో ఎల్ 1 గా నిలిచింది. ఇతర సంస్థలు రూ.1 లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు కోట్ చేసినట్లు ట్రైబల్ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ ఇనిస్టిట్యూట్ లో  విద్యార్థులకు 24 గంటల ఉచిత వైఫై,  60 కంప్యూటర్లతో వేర్వేరు కంప్యూటర్ ల్యాబ్‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయి.  ప్రతి విద్యార్థికి రూ.5 వేల విలువైన స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేస్తున్నారు. ప్రొజెక్టర్లు, స్క్రీన్లతో కూడిన 5 పెద్ద క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లలో నిపుణులైన ఫ్యాకల్టీతో ఐఏఎస్ మెయిన్స్  ఆప్షనల్ సబ్జెక్టులపై కోచింగ్ ఇస్తున్నారు.