రైతు వేదికల్లో యూరియా సేల్‌ కౌంటర్లు

  రైతు వేదికల్లో యూరియా సేల్‌ కౌంటర్లు
  • రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా టోకెన్ల జారీ
  •  శుక్రవారం రాష్ట్రానికి 11,181 టన్నుల యూరియా
  • శనివారం మరో 9,039 టన్నులు రాక
  • వచ్చే 20 రోజుల్లో  రెండు లక్షల టన్నులు వచ్చే చాన్స్‌
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి

హైదరాబాద్, వెలుగు : రైతు వేదికల్లో అదనపు యూరియా సేల్‌ కౌంటర్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ నుంచి రాష్ట్రంలోని కరీంనగర్, మిర్యాలగూడ, వరంగల్, పెద్దపల్లి ప్రాంతాల్లోని రైల్వే రేక్ పాయింట్లకు 11,181 టన్నుల యూరియా చేరిందని చెప్పారు. శనివారం -కృష్ణపట్నం నుంచి మరో 9,039 టన్నుల యూరియా వరంగల్, సనత్‌నగర్‌, కరీంనగర్‌ రైల్వే రేక్‌ పాయింట్లకు చేరుకుంటుందని మంత్రి తెలిపారు.

ఈ నెలలో కేవలం 4 రోజుల్లోనే రాష్ట్రానికి 28 వేల టన్నుల యూరియా సరఫరా జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌లో  ఇప్పటివరకు 8,20,112 టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, గతేడాది ఇదే టైంలో 7,75,157 టన్నుల యూరియా మాత్రమే అమ్మకం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. 

ఎరువులు సులభంగా అందేలా చర్యలు

యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతులకు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మండలానికి ఒకటి, రెండు ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్​) మాత్రమే ఉన్న ప్రాంతాల్లో రైతు వేదికల్లో గ్రామాల వారీగా టోకెన్లు జారీ చేయాలని సూచించారు. పాస్‌ పుస్తకాల ఆధారంగా ఒక రోజు ముందే టోకెన్లు ఇచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువులు అందించాలని చెప్పారు. 

యూరియా పంపిణీ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కోఆపరేటివ్, మార్క్‌ఫెడ్‌ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పోలీస్‌, విజిలెన్స్ విభాగాల పర్యవేక్షణతో బ్లాక్‌ మార్కెటింగ్‌ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మరో 20 రోజుల్లో 2 లక్షల టన్నులు..

రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను ఢిల్లీ పర్యటన టైంలో కేంద్రమంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వెల్లడించారు. వానాకాలం సాగు పెరగడంతో ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వచ్చే 20 రోజుల్లో రోజుకు 10 వేల టన్నుల చొప్పున 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. స్పందించిన కేంద్రం తూర్పు తీరంలోని పోర్టులకు రానున్న నాలుగు నౌకల నుంచి తెలంగాణకు యూరియా కేటాయించేందుకు అంగీకరించిందని తెలిపారు. 

రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఫ్యాక్టరీ షట్‌డౌన్‌ కావడంతో దేశీయ తయారీ యూనిట్ల నుంచి అదనంగా 30 వేల టన్నుల యూరియా కేటాయించేందుకు కేంద్రం అంగీకరించిందని చెప్పారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ యూనిట్‌ను తిరిగి ప్రారంభించేందుకు వచ్చే 3-4 రోజుల్లో చర్యలు చేపడతామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఎరువుల లభ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, అధిక మొత్తంలో నిల్వ చేసుకోవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎరువుల కొరత లేకుండా సకాలంలో అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల వివరించారు.