
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూల్ టీచర్లు,హెడ్మాస్టర్లు, విద్యాశాఖ అధికారుల విదేశీ పర్యటనకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు. టీచర్లు, విద్యాశాఖ అధికారులు తమ వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచుకునేందుకుగానూ అంతర్జాతీయ ఉత్తమ విద్యా పద్ధతులను నేర్చుకోవడానికి 5 రోజుల ఎక్స్ పోజర్ అండ్ ఎక్స్ఛేంజ్కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
ప్రతి జిల్లా నుంచి ముగ్గురు టీచర్లను పారదర్శకంగా ఎంపిక చేసి, వివరాలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. విద్యారంగంలో అభివృద్ధి చెందిన సింగపూర్, ఫిన్‌లాండ్, వియత్నాం, జపాన్ దేశాలకు టీచర్లను పంపించాలని నిర్ణయించారు. ఒక్కో దేశానికి 40 మంది చొప్పున మొత్తం 160 మందిని పంపించనున్నారు.
కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక
ప్రతి జిల్లాలో గవర్నమెంట్, జిల్లాపరిషత్, మోడల్ స్కూల్, సొసైటీ గురుకులాల నుంచి ముగ్గురు టీచర్ల చొప్పున విదేశీ టూర్‌కు పంపించనున్నారు. వీరి ఎంపికను పారదర్శకంగా నిర్వహించేందుకుగానూ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా అడిషనల్ కలెక్టర్, డీఈవో, కలెక్టర్ నామినేట్ చేసిన సీనియర్ జిల్లా అధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి.. ముగ్గురు టీచర్లను ఎంపిక చేయాలని నవీన్ నికోలస్ ఆదేశించారు.
ఎస్జీటీ/లాంగ్వేజ్ పండిట్/పీఈటీ నుంచి ఒకరు, స్కూల్ అసిస్టెంట్/ పీజీటీల నుంచి ఒకరు, హెడ్మాస్టర్ / ప్రిన్సిపాల్ నుంచి ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. పదేండ్ల సర్వీస్ పూర్తి చేసుకొని, 55 ఏండ్లలోపు వయసు ఉన్నవారినే ఈ టూర్లకు ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.