- వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ లో ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
- ఏటా 4 వేల నుంచి 12 వేల శాంపిల్స్ కు పెరగనున్న డ్రగ్ టెస్టింగ్ సామర్థ్యం
- మందులు, ఫుడ్స్‌కు ఒకే చోట టెస్టింగ్
హైదరాబాద్, వెలుగు: నకిలీ మందులు, కల్తీ ఫుడ్స్కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీని బలోపేతం చేసేలా వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో కొత్తగా నాలుగు ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో కేవలం డ్రగ్ టెస్టింగ్ కే అని భావించినా, ఆహార కల్తీలను నివారించేందుకు ఒకే ప్రాంగణంలో మందులు, ఫుడ్స్‌ను పరీక్షించేలా ఈ సెంటర్లను తీర్చిదిద్దనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి మందుల పరీక్షలకు హైదరాబాద్‌లోని డీసీఏ ఆఫీసులో ఒకే ల్యాబ్ ఉండగా, ఫుడ్ టెస్టింగ్‌కు నాచారంలో మాత్రమే సౌకర్యం ఉంది. దీంతో జిల్లాల నుంచి శాంపిల్స్ పంపితే, రిపోర్ట్ వచ్చేందుకు ఆలస్యం జరుగుతుండడంతో నిందితులు తప్పించుకుంటున్నారని ప్రభుత్వం గ్రహించింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ (జీజీహెచ్ )లలో అందుబాటులో ఉన్న స్థలంలో ఈ ల్యాబ్ లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే శాంపిల్స్ సేకరించిన వెంటనే అక్కడికక్కడే పరీక్షించి, అక్రమార్కులకు చెక్ పెట్టే వీలుంటుంది.
టార్గెట్ 12 వేల డ్రగ్ శాంపిల్ టెస్టింగ్..
రాష్ట్రంలో ఫార్మా రంగం వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని మొత్తం ఫార్మా ఉత్పత్తిలో మన రాష్ట్రం వాటా 35 శాతంగా ఉండగా, ఎగుమతుల్లో 32 శాతం వాటా కలిగి ఉంది. ప్రపంచ వ్యాక్సిన్ఉత్పత్తిలో మూడో వంతు ఇక్కడే తయారవుతోంది. ఏటా సుమారు 5.89 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 45 వేలకు పైగా మెడికల్ షాపులు, వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉంటే, కేవలం ఒకే ఒక టెస్టింగ్ ల్యాబ్ ఉంది. దీంతో నిఘా వ్యవస్థకు సవాల్‌గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ల్యాబ్ లో ఏటా కేవలం 4 వేల శాంపిల్స్ మాత్రమే టెస్టింగ్‌చేసే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పాటు చేసే నాలుగు రీజనల్ ల్యాబ్ ల వల్ల ఈ సామర్థ్యాన్ని ఏడాదికి 12 వేల శాంపిల్స్ కు పెంచాలని డీసీఏ నిర్ణయించింది.
రూ. 73 కోట్లు కావాలని కేంద్రానికి ప్రతిపాన..
డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బలోపేతానికి డీసీఏ కేంద్రానికి ఇటీవల ప్రతిపాదనలు పంపింది. స్ట్రెంతెనింగ్ ఆఫ్ స్టేట్స్ డ్రగ్ రెగ్యులేటరీ సిస్టమ్ (ఎస్ఎస్డీఆర్ 2.0) స్కీమ్ కింద ప్రతిపాదనలు పంపాలని కేంద్రం కోరడంతో డీసీఏ కీలక ప్రతిపాదలు చేసింది.
2026 నుంచి 2031 వరకు ఐదేళ్ల కాలానికి మొత్తం రూ. 73.28 కోట్లు అవసరమని ప్రతిపాదించింది. ఈ నిధులతో కొత్త డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ లతో పాటు హైదరాబాద్ ల్యాబ్ లో కెమికల్ టెస్టింగ్ పరికరాలైన హెచ్పీఎల్సీ, జీసీ వంటి వాటిని కొనుగోలు చేయనున్నారు. వీటి కోసం రూ. 10 కోట్లు, కొత్త ల్యాబ్‌ల నిర్మాణానికి రూ. 40 కోట్లు ఖర్చు చేయనున్నారు. పెరిగిన పనిభారానికి తగ్గట్టుగా 58 మంది జూనియర్ అనలిస్టులు, టెక్నీషియన్లను నియామకం చేసేందుకు రూ. 10.31 కోట్లు కేటాయించనున్నారు.

