ఆన్లైన్ లోనే డాక్టర్ల బదిలీల ప్రక్రియ..వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే ట్రాన్స్‌‌‌‌ ఫర్లు

ఆన్లైన్ లోనే డాక్టర్ల బదిలీల ప్రక్రియ..వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే ట్రాన్స్‌‌‌‌ ఫర్లు
  • ఒక కేడర్‌‌‌‌లో 40 శాతం మందికి మించొద్దు
  • నాలుగేండ్లు నిండిన వారికి చాన్స్
  • జూన్ 6న ట్రాన్స్ ఫర్ల  ఫైనల్ లిస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డాక్టర్ల బదిలీల ప్రక్రియను పూర్తిగా ఆన్‌‌‌‌ లైన్, వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో 38కి తగ్గట్టుగా, వైద్యారోగ్య శాఖ తాజాగా బదిలీల మార్గదర్శకాలకు జీవో 28 విడుదల చేసింది. వైద్య సేవలకు ఎక్కడా ఆటంకం కలగకుండా ఉండేందుకు ఏ కేడర్‌‌‌‌లోనైనా గరిష్టంగా 40 శాతం మంది ఉద్యోగులను మాత్రమే బదిలీ చేయాలని నిబంధన విధించింది.

ఒకే స్టేషన్‌‌‌‌ లో నాలుగేండ్లకు పైగా పనిచేస్తున్న డాక్టర్లు బదిలీలకు అర్హులని.. అయితే, అది 40 శాతం సీలింగ్‌‌‌‌కు లోబడే ఉంటుందని పేర్కొంది. ఇక స్పెషలిస్ట్ డాక్టర్లను వారి ప్రత్యేకత ఉన్న విభాగాల్లోని ఖాళీల్లోనే నియమించాలని, సూపర్ స్పెషాలిటీ పోస్టుల బదిలీలు కూడా ఆయా ఫంక్షనల్ యూనిట్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.ముందుగా ఈ నెల 29న ఖాళీల వివరాలతో పాటు సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాను వెల్లడిస్తారు.

30, 31 తేదీల్లో ఆన్‌‌‌‌ లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించి, జూన్ 2న వాటిని పరిష్కరించిన అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత జూన్ 3, 4 తేదీల్లో ఉద్యోగులు ఆన్‌‌‌‌ లైన్ ద్వారా తమకు నచ్చిన ప్రాంతాల కోసం ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత జూన్ 6న బదిలీల తుది జాబితాను విడుదల చేసి, పోస్టింగ్ ఉత్తర్వులను జారీ చేయనున్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్. చోంగ్తూ వివరించారు.

పర్యవేక్షణకు కమిటీ..

ఈ బదిలీల పర్యవేక్షణకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆర్‌‌‌‌ఏహెచ్‌‌‌‌సీటీ సీఈఓ, డీసీఏ డైరెక్టర్ జనరల్, వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఖాళీల గుర్తింపు నుంచి పోస్టింగ్ ఆర్డర్ల వరకు ప్రతి అడుగును ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మరోవైపు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి  కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సెల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.