ఉమెన్ జస్టిస్ లో మనమే టాప్.. తెలంగాణ హైకోర్టులో 30 మంది జడ్జిల్లో 10 మంది మహిళలే..

ఉమెన్ జస్టిస్ లో మనమే టాప్.. తెలంగాణ హైకోర్టులో 30 మంది జడ్జిల్లో 10 మంది మహిళలే..
  • రాష్ట్ర హైకోర్టులో 30 మంది జడ్జీల్లో 10 మంది మహిళా న్యాయమూర్తులు
  • 33.3 శాతంతో దేశంలోనే ముందు వరుసలో 
  • సుప్రీంకోర్టులో ఏకైక మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న
  • ‘సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్’ రిపోర్ట్ లో వెల్లడి
  • న్యాయ వ్యవస్థలో లింగ సమానత్వంపై ఎస్సీబీఏ ఆందోళన

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోనే అత్యధిక మహిళా న్యామూర్తులున్న హైకోర్టులలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. రాష్ట్ర హైకోర్టులో మొత్తం 30 మంది న్యాయమూర్తులు ఉండగా.. అందులో 10 మంది మహిళా జడ్జీలు ఉన్నారు. అంటే దేశంలో 33.3 శాతంతో తెలంగాణ హైకోర్టు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టు సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ రిపోర్ట్ లో వెల్లడించింది. పక్క రాష్ట్రమైన ఏపీ హైకోర్టులో మొత్తం 30 మంది జడ్జీలు ఉండగా.. కేవలం ఐదుగురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నట్టు పేర్కొంది. 

ఇక అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 79 జడ్జీ పోస్ట్ లు ఉంటే కేవలం ముగ్గురే  మహిళా జడ్జీలు ఉన్నారు. అలాగే, దేశంలోని ఎనిమిది హైకోర్టులలో కేవలం ఒక్కరి చొప్పున మాత్రమే ఉమెన్ జడ్జీలు ఉన్నట్టు తెలిపింది. మరో మూడు హైకోర్టులలో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా అన్ని హైకోర్టులలో మొత్తం 1,100 మంది న్యాయమూర్తుల పోస్టులు ఉన్నాయని గుర్తుచేసింది. ఇందులో 773 న్యాయమూర్తులు ఉండగా... కేవలం 103 మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారని తెలిపింది. వీరి శాతం 14.42 గా మాత్రమే ఉందని తెలిపింది. 

సుప్రీంలో ఏకైక మహిళా జడ్జిగా జస్టిస్ నాగరత్న

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏకైక మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు 51 మంది చీఫ్ జస్టిస్ లుగా సేవలందించారు. అయితే, దేశ చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అరుదైన గౌరవం జస్టిస్ నాగరత్నకు దక్కనుంది. 2027లో సీజేఐ గా ఆమె 36 రోజులు సేవలందించనున్నారు. ఇదే సందర్భంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం మహిళా జడ్జీల ప్రాతినిధ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

చివరగా 2021, ఆగస్టు 31న జస్టిస్ నాగరత్న తో పాటు జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ బేల త్రివేది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళా న్యాయమూర్తి రాలేదు. అలాగే, బార్ నుంచి 9 మందికి జడ్జీలుగా పదోన్నతి కల్పించగా.. కేవలం ఒకే ఒక్క మహిళా జస్టిస్ ఇందు మల్హోత్రా 2018లో జడ్జీగా
పదోన్నతి పొందారు.

కోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యంపై ఎస్సీబీఏ ఆందోళన

సుప్రీంకోర్టు, హైకోర్టులలో మహిళల ప్రాతినిధ్యంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో చేపట్టే జడ్జీల నియామకాల్లో ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరింది. ఈ మేరకు శనివారం నిర్వహించిన ఎస్సీబీఏ మీటింగ్ లో ఆరు అంశాలపై తీర్మానాలు చేసింది. 2021 నుంచి సుప్రీంకోర్టులో ఒక్క మహిళా న్యాయమూర్తిని నియమించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. 

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏకైక మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ బీవీ నాగరత్న ఉన్నారని గుర్తు చేసింది. అందువల్ల న్యాయస్థానాల నియామకాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. ఇదే అంశంపై ఈ ఏడాది జులై 18న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు (సీజేఐ) ఎస్సీబీఏ అధ్యక్షుడు వికాస్ సింగ్ లేఖ రాశారని గుర్తు చేసింది.