- నిబంధనలను పాటించని వాహనాలను పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్
- గ్రేటర్ పరిధిలో రంగంలోకి 10 ఎన్ఫోర్స్మెంట్ టీంలు
హైదరాబాద్, వెలుగు: దసరా రద్దీని ఆసరాగా చేసుకుని ప్రజా రవాణా వ్యవస్థ ఆదాయానికి గండికొట్టేందుకు యత్నిస్తున్న ప్రైవేట్ వాహనాలపై రాష్ట్ర రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు పాటించని ప్రైవేట్ వాహనాలను కట్టడి చేసేందుకు రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పది ఎన్ఫోర్స్మెంట్ టీమ్లను రంగంలోకి దించారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, కడప, అనంతపురం వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సు పాయింట్లపై అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. టీజీఎస్ఆర్టీసీ బస్సుల ఆదాయాన్ని దెబ్బతీస్తూ అక్రమంగా ప్రయాణికులను తరలించే ప్రైవేట్ వాహనాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి.
గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేస్తూ, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో, అక్రమంగా నడిచే వాహనాలను అవసరమైతే సీజ్ చేసేందుకు కూడా అధికారులు వెనుకాడడం లేదు.
నిబంధనలు పాటించని వాహనదారులపై ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ తనిఖీలు దసరా ముగిసే వరకు కొనసాగుతాయని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ స్పష్టం చేశారు.
