క్షయకు సకాలంలో ట్రీట్మెంట్ అందితే ముప్పు తక్కువే : మంత్రి శ్రీధర్ బాబు

క్షయకు సకాలంలో ట్రీట్మెంట్ అందితే ముప్పు తక్కువే : మంత్రి శ్రీధర్ బాబు
  •     మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
  •     శాసనసభ కమిటీ హాల్‌లో టీబీ నిర్ధారణ కిట్ల ఆవిష్కరణ 

హైదరాబాద్, వెలుగు: ఔషధాలకు లొంగని ప్రాణాంతక క్షయవ్యాధి నిర్ధారణలో ప్రపంచంలోనే తెలంగాణ  రాష్ట్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి, తగిన చికిత్స అందిస్తే రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ఫ్రెంచ్ డయాగ్నస్టిక్ దిగ్గజం 'బయోమెరియో' సంస్థ తయారు చేసిన డ్రగ్ రెసిస్టెంట్ టీబీ నిర్ధారణ కిట్లను శాసనసభ కమిటీ హాల్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...బయోమెరియో సంస్థ జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ప్లాంటు ద్వారా టీబీ కిట్ల ఉత్పత్తిని ప్రారంభించిందని వివరించారు. 

ఈ ప్లాంటు కోసం మొదటి దశలో సంస్థ రూ. 50 కోట్లు ఖర్చు పెట్టిందని వెల్లడించారు.ఇదే వేదికపై  మంత్రికి ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఎఫ్​సీసీఐ) రూపొందించిన రెండు దేశాల వాణిజ్య సంబంధాల నివేదికను ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ అందజేశారు. ఈ నివేదిక రెండు దేశాల మధ్య పెరుగుతున్న పారిశ్రామిక, ఆరోగ్య సంబంధాలను ప్రతిబింబిస్తోందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కౌన్సిలర్ చార్ల్స్ మహీ, బయోమెరియో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అలెగ్జాండర్ మెరియో, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ సర్వేశ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.