- రంజాన్ సందర్భంగా సర్కార్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రంజాన్ మాసాన్ని పుర స్కరించుకొని రాష్ట్రంలోని ఉర్దూ మీడియం స్కూళ్ల పనివేళలను మారుస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి మార్చి 20 వరకు కొత్త టైమింగ్స్ అమలులో ఉంటాయని తెలిపింది. కొత్త వేళల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్, ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లు, డైట్ కాలేజీలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటలకు ముగియనున్నాయి.
ఇతర స్కూళ్లలోని ఉర్దూ సెక్షన్లకు కూడా ఇవే వేళలు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. వర్కింగ్ అవర్స్ తగ్గింపుతో నష్టపోయిన సమయాన్ని సర్దుబాటు చేసేందుకు కొన్ని నిబంధనలు విధించారు. అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్కూళ్లు.. ఒక రోజు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ప్రైమరీ స్కూళ్లు.. రెండు పనిదినాల్లో అరగంట చొప్పున అదనంగా పనిచేసి ఆ సమయాన్ని సరి చేయాలని విద్యాశాఖ సూచించింది.
