ఏపీ 445 టీఎంసీలు తరలిస్తే.. తెలంగాణ 155 టీఎంసీలే

ఏపీ 445 టీఎంసీలు తరలిస్తే.. తెలంగాణ 155 టీఎంసీలే
  •     ఫ్లడ్​ సీజన్​ మొదలైన     ఏడు నెలల్లో మూడో వంతు వినియోగమే
  •     శ్రీశైలం, సాగర్‌‌ నీళ్ల వాడకంలో మరీ అధ్వానం
  •     రాష్ట్ర ఏర్పాటు నుంచీ ఇదే పరిస్థితి

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా నీళ్ల వాడకంలో తెలంగాణ ఎప్పటిలెక్కనే ఎన్కపడ్డది. ఏపీ ఏకంగా 445 టీఎంసీలు తరలించుకుపోతే ఫ్లడ్‌‌ సీజన్‌‌ మొదలైన ఏడు నెలల తర్వాత కూడా మన రాష్ట్రం వాడుకున్న నీళ్లు155 టీఎంసీలు మాత్రమే. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలిన నీళ్లను లెక్కల్లో చూపలేదు. వాటిని కూడా కలిపి ఏపీతో పోలిస్తే తెలంగాణ వాడుకున్న నీళ్ల వాటా పావు వంతు మాత్రమే ఉంటుంది. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేండ్లు అవుతున్నా కృష్ణా నీటి వినియోగంలో రాష్ట్ర పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ నుంచి ఏపీ తీసుకున్న నీళ్లతో సమానంగా తెలంగాణ శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ ల నుంచి నీటిని వాడుకోలేకపోయింది. కృష్ణా బేసిన్‌‌లో 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏటా ఏపీ కోటాకు మించి నీళ్లు తరలించుకుపోతోంది. తెలంగాణ 40 నుంచి 50 టీఎంసీలు వినియోగించుకోలేక క్యారీ ఓవర్‌‌ పేరుతో లెటర్లు రాస్తూ కాలం వెళ్లదీస్తోంది. 

తెలంగాణ మొత్తం వాడకం..

నాగార్జునసాగర్‌‌ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ఎత్తిపోతల నుంచి తెలంగాణ జనవరి23 వరకు కేవలం 53.13 టీఎంసీలు మాత్రమే తీసుకుంది. శ్రీశైలంపై ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 24.64 టీఎంసీలు తరలించింది. చెన్నై తాగునీటి సరఫరాలో మన వాటా1.67 టీఎంసీలు, ఆవిరి నష్టాల్లో వాటా ఒక టీఎంసీని కలుపుకుంటే రాష్ట్రం వాడుకున్నది 80.44 టీఎంసీలు. జూరాల ప్రాజెక్టు నుంచి 21.68 టీఎంసీలు, దానిపై ఏర్పాటు చేసిన భీమా ఎత్తిపోతల ద్వారా10.32, నెట్టెంపాడు నుంచి 8.18, కోయిల్‌‌సాగర్‌‌ నుంచి 2.02, పాకాల లేక్‌‌ నుంచి1.89, హైదరాబాద్‌‌ తాగునీరు, మిషన్‌‌ భగీరథ కలుపుకొని31.83 టీఎంసీలు తరలించుకోగలిగింది. అన్ని ప్రాజెక్టులు నిండి సర్‌‌ ప్లస్‌‌ అయ్యే రోజుల్లో అన్ని ఔట్‌‌లెట్ల ద్వారా తెలంగాణ వాడుకున్నది11.94 టీఎంసీలు మాత్రమే. ఇలా మొత్తంగా రాష్ట్ర వినియోగం168 టీఎంసీలు.

మిగిలింది ఇంకో 127 టీఎంసీలు

కృష్ణా బేసిన్‌‌లో తెలంగాణ రాష్ట్ర వాటా ఇంకో 127.07 టీఎంసీలు ఉన్నాయి. ఇందులో 112.51 టీఎంసీలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ నుంచే తీసుకోవాల్సి ఉంది. యాసంగి సీజన్‌‌ సాగునీరు, ఎండాకాలం తాగునీటి అవసరాలు లెక్కలోకి తీసుకున్న మన రాష్ట్రం ఇంకో 70 టీఎంసీలకు మించి తీసుకునే అవకాశం లేదు. ఈ లెక్కన కామన్‌‌ ప్రాజెక్టుల్లోనే మన వాటా 40 టీఎంసీలకు పైగా మిగిలిపోయే అవకాశముంది. శ్రీశైలంలో 834 అడుగులకు ఎగువన17.74 టీఎంసీలు, నాగార్జునసాగర్‌‌లో 510 అడుగులకు ఎగువన 145 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి కృష్ణా బేసిన్‌‌లో ఇంకో 103.24 టీఎంసీల కోటా మిగిలిఉండగా, శ్రీశైలం, సాగర్‌‌ నుంచి 50.23 టీఎంసీలు తీసుకోవాల్సి ఉంది. ఆ రాష్ట్రం సర్‌‌ప్లస్‌‌ రోజుల్లో తరలించిన నీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి ఇంకో 53 టీఎంసీల నీళ్లు మాత్రమే తీసుకునే చాన్స్ ఉంటుంది. నిర్మాణంలో ఉన్న ఎస్‌‌ఎల్బీసీ టన్నెల్‌‌, పాలమూరు - రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి ఉంటే కృష్ణా నీళ్లను పూర్తి కోటా మేరకు వాడుకునే అవకాశం ఉండటంతో పాటు ప్రాజెక్టులన్నీ నిండిపోయే రోజుల్లో ఏపీతో సమానంగా సర్‌‌ప్లస్‌‌ కోటా ఉపయోగించుకునే చాన్స్‌‌ ఉంటుందని బేసిన్‌‌ పరిధిలోని రైతులు చెప్తున్నారు.

ఏపీ వాడుకున్న నీళ్లు ఇలా..

నాగార్జునసాగర్‌‌ కుడి, ఎడమ కాలువల ద్వారా ఏపీ 125.47 టీఎంసీలు తరలించుకుపోయింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ ద్వారా 94.75 టీఎంసీలు, హెచ్‌‌ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి 22.93 టీఎంసీలు, చెన్నై తాగునీటిలో ఏపీ కోటా 3.33, ఆవిరి నష్టాల్లో ఆ రాష్ట్ర వాటా 2 టీఎంసీలు కలుపుకొని ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 248.48 టీఎంసీలు వాడుకోగలిగింది. తుంగభద్ర హైలెవెల్‌‌ కెనాల్‌‌ నుంచి 30.09, లో లెవెల్‌‌ కెనాల్‌‌ నుంచి 15.31, కర్నూల్‌‌ - కడప కెనాల్‌‌ ద్వారా 37.43, మునియేరు నుంచి 1.95, గుంటూరు కెనాల్‌‌ నుంచి 2.04, గాజులదిన్నె నుంచి 0.28 టీఎంసీలు తరలించుకుపోయింది. కృష్ణా డెల్టా సిస్టం నుంచి 116.36 టీఎంసీలు, ప్రాజెక్టులన్నీ సర్‌‌ప్లస్‌‌ అయ్యే రోజుల్లో అన్ని ఔట్‌‌లెట్ల నుంచి 49.72 టీఎంసీలు తరలించుకుపోయారు. మొత్తంగా ఏపీ 501.66 టీఎంసీలు ఉపయోగించుకుంది.