- చింతన్ శివిర్‌లో మంత్రి అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చండీగఢ్‌లో ఆదివారం నిర్వహించిన చింతన్ శివిర్–2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం “ సమానత్వం– సాధికారత– స్వాభిమాన జీవితం” లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.
సోషల్ వెల్ఫేర్ శాఖను “ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్”గా మార్చడం, దళితుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టికి నిదర్శనమని తెలిపారు. ఎన్నో ఏళ్ల తర్వాత రాష్ర్టంలో డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని మంత్రి గుర్తు చేశారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ కింద రూ.574.74 కోట్లు వెచ్చించి 3,39,731 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చినట్లు మంత్రి తెలిపారు. ప్రీ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్స్ ద్వారా రూ.66.31 కోట్లు ఖర్చు చేసి 73,666 మంది విద్యార్థులకు సాయం అందించామని చెప్పారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద రూ.103.49 కోట్లు వెచ్చించి 564 మంది విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు కల్పించామని వివరించారు.

