బెస్ట్ టూరిజం స్టేట్గా తెలంగాణకు అవార్డు

బెస్ట్ టూరిజం స్టేట్గా తెలంగాణకు అవార్డు

దేశ జీడీపీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని రంగాలతోపాటు కేంద్ర అవార్డుల్లో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. గ్రామ పంచాయితీ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో 20 అవార్డుల్లో 19 తెలంగాణకే వచ్చాయని చెప్పారు. స్వచ్ఛభారత్ లో 13 అవార్డులు వచ్చినట్లు తెలిపారు. టూరిజం అవార్డుల్లో బెస్ట్ టూరిజం స్టేట్ గా తెలంగాణకు అవార్డు వచ్చిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. 

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు ప్రధాని మోడీ ప్రత్యేక సహకారం ఎందుకు అందించడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. మంచిగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించాలి కానీ కక్ష సాధిస్తారా అని నిలదీశారు. తెలంగాణ పురోగతి చెందుతుంది కాబట్టే కేంద్రం అవార్డులు ఇస్తుందన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు, అభివృద్ధి చేస్తున్న సీఎంలకు సహకరిస్తే దేశం బాగుపడుతుందని హితవు పలికారు. మేము చేస్తున్న పనులు తప్పు అయితే తెలంగాణకు ఇన్ని అవార్డులు ఎలా వస్తున్నాయో కేంద్రం ఆలోచించుకోవాలన్నారు. 

తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే భారత్ నెంబర్ వన్ గా నిలుస్తుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం నుంచి సహకారం లేకపోయినా తెలంగాణ అవార్డులు సాధించిందని వ్యాఖ్యానించారు. అవార్డులు ఇచ్చే బదులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను కేంద్రం ఇబ్బందులపాలు చేయవద్దని కోరారు.