హైదరాబాద్: ముంబై వేదికగా జరిగిన 2026 ఆసియా క్రీడల తొలి సెలెక్షన్ ట్రయల్స్‌లో తెలంగాణ సెయిలర్లు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించారు. అండర్–18 జూనియర్ స్కిఫ్ విభాగంలో లాహిరి కొమరవెల్లి–ఈశ్వ సూరగాణి గౌడ్ జోడీ అగ్రస్థానంతో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో దీక్షిత కొమరవెల్లి–అబ్దుల్ రహీమ్ జంట స్వల్ప పాయింట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించారు.
సీనియర్ స్విఫ్ క్లాస్‌లో తనుజా కామేశ్వర్–ధరణి లావేటి రజతంతో మెరవగా... వినోద్ దండు–అరవింద్ మహ్లాట్ ద్వయం కాంస్యాన్ని కైవసం చేసుకుంది. పతకాలు సాధించిన వారిలో ఎక్కువ మంది యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన వారే కావడం గమనార్హం. హుస్సేన్ సాగర్‌లోని ఇంటర్నేషనల్ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న సెయిలర్లు ముంబైలో 45 రోజుల పాటు సాధన చేశారు.
