‘పాలమూరు’ డీపీఆర్​ను పరిశీలించండి

‘పాలమూరు’ డీపీఆర్​ను పరిశీలించండి

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్​స్కీమ్ డీపీఆర్​ను పరిశీలించాలని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)ను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం న్యాయవివాదాలు లేనందున డీపీఆర్​ను పరిశీలించి అనుమతులివ్వాలని కోరుతూ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్​ సీడబ్ల్యూసీ చైర్మన్​కు శుక్రవారం లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులపై ఏపీ దాఖలు చేసిన పిటిషన్ ​ఇన్నాళ్లు బ్రిజేశ్​కుమార్​ట్రిబ్యునల్​వద్ద పెండింగ్​లో ఉన్నందున డీపీఆర్​పరిశీలన సబ్​జ్యుడిస్ ​అవుతుందని సీడబ్ల్యూసీ పక్కన పెట్టిందని లేఖలో ప్రస్తావించారు.

 ఈ అంశం తమ పరిధిలోకి రాదని ఇటీవల బ్రిజేశ్ ​ట్రిబ్యునల్ ​తీర్పు వెలువరించిందని, ఈ నేపథ్యంలో డీపీఆర్​పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు బచావత్​ట్రిబ్యునల్ ​చేసిన కేటాయింపుల్లో నుంచి మైనర్​ఇరిగేషన్​లో వినియోగించుకోని 45 టీఎంసీలను పాలమూరుకు కేటాయించామని తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి నీళ్లకు బదులు నాగార్జున సాగర్​కు ఎగువన ఉన్న ప్రాజెక్టులకు 80 టీఎంసీలను కేటాయించాలని బచావత్​ ట్రిబ్యునల్​ఆర్డర్​ఇచ్చిందని గుర్తు చేశారు. 

2009లోనే పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని టీఏసీ క్లియరెన్స్ ​ఇచ్చిందన్నారు. 2013లో నిర్వహించిన ఏపీ స్టేట్ ​లెవల్ ​టెక్నికల్ ​అడ్వైజరీ కమిటీ సమావేశంలో పోలవరం నుంచి మళ్లించే నీళ్లకు బదులు 45 టీఎంసీలను కృష్ణా బేసిన్ ​ప్రాజెక్టులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ప్రస్తుతం కోర్టుల్లో ఎలాంటి న్యాయవివాదాలు లేనందున ప్రాజెక్టు డీపీఆర్​ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని కోరారు.