డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించిన గొల్లకురుమలు.

డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ను ముట్టడించిన గొల్లకురుమలు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  గొర్రెల పంపిణీ స్కీమ్ ద్వారా నగదు బదిలీ చేయాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం(జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌)డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసింది. అందుకు అవసరమైన నిధులను సర్కారు వెంటనే రిలీజ్ చేయాలని కోరింది. సోమవారం జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌  రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  గొల్ల కురుమలు రాష్ట్ర పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కురుమ, యాదవులను కోటీశ్వరులను చేస్తామని చెప్పి అప్పులపాలు చేసిందని ఆరోపించారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన గొర్రెల వల్ల దళారులే ఎక్కువ లాభపడ్డారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,16,370 మందితో డీడీలు కట్టించుకుని కేవలం 28 వేల మందికే గొర్రెలు ఇచ్చారని వెల్లడించారు. మరో  88 వేల మందికి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.  సరిపడా నిధులు లేకుండా డీడీలు ఎందుకు కట్టించుకున్నారని నిలదీశారు.  ఎన్నికల వేళ గొర్రెలు వస్తాయా రావా అని గొల్లకురుమలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. 

రూ.5 వేల పెన్షన్ కావాలె

దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేయాలని జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 50 ఏండ్లు దాటిన గొర్ల కాపరులకు నెలకు రూ.5,000 పెన్షన్ ఇవ్వాలన్నారు. ప్రమాదాల్లో చనిపోతే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయాలని కోరారు. అన్ని గొర్లకు ఇన్సూరెన్స్ చేయాలన్నారు. లేకుంటే వచ్చే  ఎన్నికల్లో  పార్టీ అభ్యర్థులను గ్రామాల్లో తిరుగనీయమని, ప్రభుత్వాన్ని ఓడిస్తామని హెచ్చరించారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులును కలిసి వినతి పత్రం అందజేశారు. జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. ముట్టడి కార్యక్రమంలో జీఎంపీఎస్‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్, రాష్ట్ర నేతలు శంకరయ్య, లింగయ్య, అశోక్, సాదం రమేశ్, మధుకర్, కాల్ల సురేశ్, క్రిష్ణ, శ్రీకాంత్, ఓయూ విద్యార్థి నేతలు కొంగల పాండు, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.