మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్

మూసీ పునరుజ్జీవానికి థేమ్స్ ప్లాన్
  • లండన్‌ పర్యటనలో సీఎం రేవంత్ వెల్లడి
  • థేమ్స్ సందర్శన.. నది పాలక మండలితో చర్చలు
  • మూసీ పునరుజ్జీవానికి సపోర్ట్ చేస్తామన్న పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ

హైదరాబాద్, వెలుగు: మూసీ నది పునరుజ్జీవానికి లండన్‌‌‌‌లోని థేమ్స్ నది ప్లాన్‌‌‌‌ను అమలు చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. ‘‘నదులు, సరస్సులు, సముద్ర తీరం వెంట ఉన్న నగరాలన్నీ చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ సిటీకి అలాంటి ప్రత్యేకత ఉంది. మూసీ నది, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటివి కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకు వస్తే.. నదులు, సరస్సులతో హైదరాబాద్ మరింత శక్తిమంతంగా తయారవుతుంది”అని వివరించారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఇతర దేశాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను తెలుసుకునేందుకు లండన్‌‌‌‌లో రేవంత్ పర్యటించారు. థేమ్స్ నదిని సందర్శించి.. నిర్వహణ తీరును, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. థేమ్స్ రివర్ పాలక మండలి, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులు, నిపుణులతో దాదాపు మూడు గంటల పాటు  చర్చలు జరిపారు. దశాబ్దాలుగా వివిధ దశల్లో థేమ్స్ నదీ తీరం వెంట చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్‌‌‌‌కు అక్కడి కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ సియాన్ ఫోస్టర్, పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహల్ లివీ వివరించారు.

సహకారానికి ఓకే

హైదరాబాద్‌‌‌‌లో మూసీ నదిని పునరుజ్జీవింపజేసేందుకు చేస్తున్న అన్ని ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్ లైన్, వివిధ సంస్థల భాగస్వామ్యంపైనా చర్చించింది. ఈ ప్రాజెక్టుకు నిర్దిష్ట సహకారం అందించేందుకు భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపాలని ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆమ్రపాలి, ఇన్వెస్ట్ మెంట్స్ అండ్ ప్రమోషన్స్ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ ఎస్ఈ వెంకట రమణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కలసి లండన్ షార్డ్ టవర్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు.

భారత సంతతి ఎంపీలతో రేవంత్ భేటీ

ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తేనే ఏ దేశంలోనైనా ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అన్నారు. లండన్ వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్‌‌‌‌లో భారత మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను ఆయన కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ప్రజాస్వామ్య భావనను నరనరాన జీర్ణించుకున్న పార్టీ కాంగ్రెస్. నాకు ఈ అవకాశం వచ్చినట్లే.. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తే దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు” అని అన్నారు. భారత్‌‌‌‌, బ్రిటన్‌‌‌‌ దేశాల మధ్య చారిత్రక సంబంధాలను గుర్తుచేశారు. ‘‘ఒకప్పుడు ఇండియాను బ్రిటన్ పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడింది. అప్పుడు మహాత్మా గాంధీ ఎంచుకున్న అహింస, న్యాయ పోరాటమే నేటికీ మార్గదర్శకాలు. ఈ సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 
 

CM Revanth Reddy said that London's Thames River Plan will be implemented for the revival of the Musi River. Cities along rivers, lakes and sea coasts have developed historically.