
- దేశంలోనే మొదటిసారి ఐటీఏ కింద కేసు నమోదు
- చంచల్‌గూడ జైలుకు రాధాకిషన్ రావు
- 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్
- ఐదు రోజుల కస్టడీకి భుజంగరావు, తిరుపతన్న
- త్వరలో మరికొందరు పోలీసు అధికారుల అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను ఈ కేసులో చేరుస్తూ నాంపల్లి కోర్టులో స్పెషల్ టీమ్ పోలీసులు మెమో దాఖలు చేశారు. దీంతో పాటు మరికొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు.
ఈ కేసులో సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు శుక్రవారం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 11 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో ఆయన్ను పంజాగుట్ట పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్ట్ అయిన పోలీసు అధికారుల సంఖ్య నాలుగుకు చేరింది.
ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్నను స్పెషల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం దాకా బంజారాహిల్స్ పీఎస్‌లో రాధాకిషన్ రావును విచారించిన బృందం.. తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్నికల టైమ్‌లో ప్రైవేట్ వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టినట్టు రాధాకిషన్ రావు విచారణలో ఒప్పుకున్నట్టు తెలిసింది. అనధికారికంగా, చట్టవిరుద్ధంగా నిఘా ఉంచడం, రాజకీయ పక్షపాతంతో సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టినట్టు వెల్లడైంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అక్రమంగా డబ్బులు రవాణ చేసేందుకు అధికారిక వనరులను ఉపయోగించినట్టు పోలీసులకు రాధాకిషన్ రావు వివరించారు. ఈ కేసులో పలువురు నిందితులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్టు కూడా అంగీకరించినట్టు సమాచారం.
గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు
రాధాకిషన్ రావుకు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు, అడ్వకేట్లను కలిసేందుకు పోలీసులు అవకాశం ఇచ్చారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి తరలిస్తున్న సమయంలో అక్కడున్న మీడియాకు రాధాకిషన్ రావు చేతులు జోడించి నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆయనకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి కొంపల్లిలో నివాసం ఉంటున్న నాంపల్లి 14వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.
రిమాండ్ కేస్ డైరీని పరిశీలించిన జడ్జి.. రాధాకిషన్ రావుకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆయన్నుంచి మరింత సమాచారం, ఆధారాలు సేకరించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. దీని కోసం వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్‌పై శనివారం కోర్టులో విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. రాధాకిషన్ రావు తరఫు అడ్వకేట్లు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కస్టడీపై సోమవారం వాదనలు జరగనున్నాయి.
మరో ఇద్దరు పోలీసుల అరెస్ట్‌కు రంగం సిద్ధం!
సిటీ టాస్క్‌ఫోర్స్‌లో రాధాకిషన్‌రావు ఆధ్వర్యంలో పనిచేసిన నలుగురు ఇన్‌స్పెక్టర్లు, ఐదుగురు ఎస్‌ఐలను కూడా స్పెషల్ టీమ్ ప్రశ్నించింది. రాధాకిషన్ రావు చేసిన ఆపరేషన్స్ గురించి ఆరా తీసింది. ఈ క్రమంలోనే హవాలా వ్యాపారులు, ఇల్లీగల్ బిజినెస్ చేసే వారిని బ్లాక్‌మెయిల్ చేసినట్టు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్‌తో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.
చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పీఎస్‌కు..
ప్రణీత్ రావు వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా పోలీసులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్నలను కోర్టు అనుమతితో శుక్రవారం ఉదయం స్పెషల్ టీమ్ పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. ఐదు రోజుల విచారణలో భాగంగా శుక్రవారం మొదటి రోజు వారిని వేర్వేరుగా పీఎస్‌లోని ఫస్ట్ ఫ్లోర్లో ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ పోలీసులు వారిని విచారిస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్నకు ప్రణీత్ రావు ఎలాంటి ఫోన్‌కాల్స్ డేటాను అందించాడనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు.
భుజంగరావుపై భూ కబ్జా ఆరోపణలు
భుజంగరావుపై సివిల్ వివాదాలు, భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్రమాలకు పాల్పడినట్టు స్పెషల్ టీమ్ అనుమానిస్తున్నది. వీటికి సంబంధించిన కీలక విషయాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరుపతన్న ఎస్ఐబీలో పని చేస్తున్న టైమ్‌లో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం సేకరించేవాడు. ఇందులో భాగంగా ప్రణీత్ రావు నుంచి అనుమానితుల ఫోన్ రికార్డింగ్స్ తిరుపతన్నకు చేరేవని తెలిసింది. వీటితో పాటు ప్రభుత్వ ఆదేశాలతో ట్యాపింగ్ చేసి ప్రైవేట్ వ్యక్తులపై తిరుపతన్న టీమ్ నిఘా పెట్టినట్టు సమాచారం.