తెలంగాణలో టెలిమెడిసిన్ సేవలకు పెరుగుతున్న ఆదరణ

తెలంగాణలో టెలిమెడిసిన్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
  • రాష్ట్రంలోటెలిమెడిసిన్ సేవలకు పెరుగుతున్న ఆదరణ
  • జనరల్, స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం డిజిటల్ వైపు ప్రజల మొగ్గు 
  • సబ్ సెంటర్లు, పీహెచ్​సీల నుంచివీడియో, ఆడియో కాల్ ద్వారా డాక్టర్లకు కనెక్ట్
  • రాష్ట్రంలో 4,939 సెంటర్లలో 1500 మంది డాక్టర్లతో లింకప్​
  • మూడేండ్లుగా పెరుగుతూ వస్తున్న రోగుల సంఖ్య
  • ప్రతి నెలా సగటున 5 లక్షల మందికి టెలిమెడిసిన్​ సేవలు 
  • ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లోనూ ఆదరణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.  చిన్న అనారోగ్య సమస్యల నుంచి స్పెషాలిటీ వైద్య సేవల వరకు ఆన్​లైన్​ ద్వారానే డాక్టర్లను కన్సల్ట్ అవుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యనైనా.. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా డాక్టర్లతో కనెక్ట్​ అవుతున్నారు. దీంతో రోగులకు ప్రతిసారి హైదరాబాద్ లోని పెద్దాసుపత్రులకు వెళ్లే బాధ తప్పుతున్నది. అర్బన్ ప్రాంతాల్లోనే కాదు మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలు సైతం టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రైవేట్​లోనూ ఆన్ లైన్ మెడి సేవలు అందుబాటులో ఉన్నా.. ప్రభుత్వం ద్వారా నడుస్తున్న టెలిమెడిసిన్ లో పూర్తి ఉచితంగా స్పెషాలిటీ వైద్యం అందుతుండటంతో రోగుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి చిన్న చిన్న జనరల్ వైద్య సేవలు మొదలు.. కార్డియో, గైనకాలజీ, ఎండోక్రైనాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, గ్యాస్ట్రో, నెఫ్రాలజీ, న్యూరో, పీడియాట్రిక్, డైటీషియన్ తదితర స్పెషాలిటీ వైద్య సేవలు ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. రోగి అవసరాన్ని బట్టి సబ్ సెంటర్, పీహెచ్​సీ సిబ్బంది డాక్టర్ షెడ్యూల్ ఖరారు చేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం డాక్టర్ కాల్ ద్వారా అందుబాటులోకి వస్తారు. 

ఏటికేడు పెరుగుతున్న ప్రజాదరణ 

రాష్ట్రంలో 2020 నుంచి నేషనల్ హెల్త్ స్కీమ్ లో భాగంగా ఈ సంజీవని పోర్టల్ ద్వారా టెలిమెడిసిన్ సేవలను ప్రారంభించారు. మొదట్లో స్పందన అంతంత మాత్రంగానే ఉండేది. కానీ, కొవిడ్ సమయంలో ప్రజల్లో ఆన్ లైన్ మెడి సేవల గురించి అవగాహన పెరిగే కొద్దీ.. క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2022–23లో 53 లక్షల మంది టెలిమెడిసిన్ సేవలు  వినియోగించుకోగా, ఆ సంఖ్య 2023–2024  నాటికి 78 లక్షలకు పెరిగింది. 2024–25 మార్చి చివరి నాటికి ఏకంగా 87 లక్షల మంది రోగులు టెలిమెడిసిన్ సర్వీస్ ను వినియోగించుకోవడం విశేషం. నెలకు సగటున సుమారు 5 లక్షల మంది ఈ టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు జనరల్, స్పెషలిస్ట్ వైద్య సేవలు కలిపి మొత్తం 2.46 కోట్ల మంది టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందారు. ఇలా ఏడాదికేడాది టెలిమెడిసిన్ ను వినియోగించుకునే రోగుల సంఖ్య క్రమంగా పెగుతుండటంతో.. అందుకనుగుణంగా మరిన్ని సెంటర్లకు విస్తరించి, డాక్టర్ల సంఖ్యను కూడా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కాగా, సబ్ సెంటర్లు, పీహెచ్​సీలు, యూపీహెచ్​సీలకు వచ్చే రోగులకు ఉన్నత వైద్యం అవసరం పడితే ఆ సెంటర్ సిబ్బంది ఈ సంజీవని పోర్టల్ ఐడీ ద్వారా సంబంధిత డిపార్ట్​మెంట్​ డాక్టర్ అపాయింట్​మెంట్​ తీసుకుంటారు. ప్రస్తుతం ఈ టెలిమెడిసిన్ సేవలు రాష్ట్రంలో 4,939 సెంటర్లలో 1500 మంది డాక్టర్లతో లింక్ అయ్యి ఉంది.

మారుమూల ప్రాంతాల్లో కూడా..

ఈ- సంజీవని టెలిమెడిసిన్ ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్ద పెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా ఆందోళన చెందకుండా రోగులకు టెలిమెడిసిన్​ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్న  ఆదిలాబాద్, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయని ఎన్ హెచ్ఎం చీఫ్ ఇన్ఫర్మేషన్​ ఆఫీసర్ మంజునాథ్ నాయక్ చెప్పారు. గత నెలలో భద్రాద్రి కొత్తగూడెంలో 27 వేల మంది, ఆదిలాబాద్ లో 18 వేల మంది, ములుగు జిల్లాలో 14 వేల మంది, జయశంకర్ భూపాలపల్లిలో 10 వేల మంది టెలిమెడిసిన్ ద్వారా సేవలు పొందారు. టెలిమెడిసిన్ కు ఎక్కువ శాతం గైనకాలజీ, పీడియాట్రిక్, డైటీషియన్ కు సంబంధించి కాల్స్ వస్తున్నాయని వివరించారు. ఈ సంజీవని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది టెలిమెడిసిన్ ద్వారా సేవలు పొందే రోగుల సంఖ్య పెరుగుతూ వస్తుందని మంజునాథ్ నాయక్ తెలిపారు. 

  • టెలిమెడిసిన్ సేవలు ఇలా..​
  • సంవత్సరం 2022–23  2023–24 2024–25
  • రోగుల సంఖ్య53 లక్షలు    78 లక్షలు   87 లక్షలు (మార్చి చివరి నాటికి)