- తొలిదశలో పెట్టి ఇప్పుడు వద్దనడంపై ఇరిగేషన్ వర్గాల్లో విస్మయం
- అప్పుడు 18 చోట్ల టెలిమెట్రీల ఏర్పాటు.. 14 ప్రాంతాలు తెలంగాణలోనే
- ఇప్పుడు మూడో ఫేజ్‌లో పెట్టాల్సినవన్నీ ఏపీ భూభాగంలోని ప్రాజెక్టులకే
- అందుకే వద్దంటున్నారనే అనుమానాలు
- టెలిమెట్రీల సొమ్ము సొంతానికి వాడేసుకోవడంపై తెలంగాణ ఆగ్రహం
- మరోసారి టెలిమెట్రీలు, నిధులపై రెండు రాష్ట్రాలకు బోర్డు లేఖ
- ఘాటుగా రిప్లై ఇచ్చేందుకు సిద్ధమవుతున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై టెలీమెట్రీల ఏర్పాటు లొల్లి ముదురుతున్నది. మీటింగ్ ఏర్పాటు చేయకుండానే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏకపక్షంగా మూడో ఫేజ్ టెలీమెట్రీలు పెట్టబోమంటూ తెలంగాణకు లేఖ రాయడం కలకలం రేపుతున్నది. ఇటు తెలంగాణ కూడా రిప్లై ఇవ్వడంతో.. మళ్లీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది.
బోర్డుకు నిధులివ్వాలని, లేదంటే టెలిమెట్రీల డబ్బులను వాడేసుకుంటామని పేర్కొన్నది. మూడో ఫేజ్‌లో టెలిమెట్రీల ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. టెలిమెట్రీలకు తెలంగాణ పైసలిచ్చినా.. ఆ పైసలను వాడేసుకున్న బోర్డు టెలిమెట్రీల ఏర్పాటుకు సాకులు చెబుతుండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. బోర్డు వ్యవహారం ఏపీకి వత్తాసు పలుకుతున్నట్టుగానే ఉందని భావిస్తున్నది. ఈ క్రమంలోనే బోర్డు తీరును ఎండగడుతూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఒకట్రెండు రోజుల్లో బోర్డుకు ఘాటుగా లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు.
అప్పుడెందుకు పెట్టారు.. ఇప్పుడెందుకు వద్దంటున్నారు..
కృష్ణా నదిపై ఇప్పటికే 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. 2016 జూన్‌లో సమావేశం నిర్వహించిన బోర్డు.. 3 దశల్లో టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే తొలి దశలో 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. అయితే, అందులో 14 ప్రాంతాలు తెలంగాణలోని ప్రాజెక్టులవే కావడం గమనార్హం. అందులో ఆరు టెలిమెట్రీలు జూరాల దగ్గరే ఏర్పాటు చేశారు.
శ్రీశైలం ఆధారంగా చేపట్టిన కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు లిఫ్ట్‌లకూ టెలిమెట్రీలను పెట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు తెలంగాణ భూభాగంలో ఉండే ఇన్‌టేక్ వెల్, ఏఎమ్మార్పీ లిఫ్ట్, పాలేరు రిజర్వాయర్‌లాంటి చోట్ల ఏర్పాటు చేశారు. కానీ, అసలు పాయింట్అయిన శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద మాత్రం పెట్టలేదు. అక్కడికి దూరంగా 12 కిలోమీటర్ల వద్ద బ్రిడ్జి కింద ఏర్పాటు చేశారు.
అక్కడ కూడా అది సరిగ్గా పనిచేయడం లేదు. తొలి దశలో టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు లేని అభ్యంతరాలు.. ఇప్పుడు సెకండ్, మూడో ఫేజ్‌లో ఏర్పాటు చేసేందుకు ఎందుకని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. ఏపీ తన్నుకుపోతున్న నీళ్ల లెక్కలను తీయకుండా.. కేవలం తెలంగాణలోనే ఎక్కువ టెలిమెట్రీలను పెట్టడమేంటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు అడ్డురాని ట్రిబ్యునల్వాదనలు.. ఇప్పుడెలా అడ్డొస్తాయని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నీటి లెక్కలు తీయడానికి అభ్యంతరాలేంటని బోర్డు తీరుపై మండిపడుతున్నారు.
మొదటి దశలో టెలిమెట్రీలు ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ఔట్‌లెట్లు ఇవే..
ఎమ్మార్పీ లిఫ్ట్, సాగర్ డ్యామ్ డైవర్షన్ టన్నెల్, ఎన్‌ఎస్పీ హెడ్ రెగ్యులేటర్, ఎన్‌ఎస్పీ లెఫ్ట్ కెనాల్ టన్నెల్ , పాలేరు రిజర్వాయర్ ఎగువన ఎంట్రీ, పాలేరు రిజర్వాయర్ దిగువన, ఎన్‌ఎస్పీ లెఫ్ట్ కెనాల్ 101.36 కిలోమీటర్ వద్ద, కల్వకుర్తి సిస్టర్న్, శ్రీశైలం రిజర్వాయర్ 17/18 బ్లాక్, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ 12.265 కిలోమీటర్, హెచ్‌ఎన్‌ఎస్ఎస్ పంప్‌హౌస్, జూరాల ప్రాజెక్టు, జూరాల రైట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటర్, జూరాల లెఫ్ట్ మెయిన్ కెనాల్ హెడ్‌రెగ్యులేటర్, జూరాల లెఫ్ట్ప్యార్లల్ కెనాల్ హెడ్‌రెగ్యులేటర్, భీమా లిఫ్ట్- –1 స్కీమ్ , నెట్టెంపాడు లిఫ్ట్, కోయిల్‌సాగర్ లిఫ్ట్ స్కీమ్ రెండోదశలో ఏర్పాటు చేయాల్సిన ఔట్‌లెట్లు..పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువపై, సాగర్ కుడి కాలువ, సాగర్ ఎడమ కాలువ, పాలేరు రిజర్వాయర్ ఎగువన ఎడమ కాలువపై 136.35 కిలోమీటర్ వద్ద, సాగర్ ఎడమ కాలువ 101.36 కిలోమీటర్ ఏపీ బార్డర్ వద్ద, పోలవరం కెనాల్ , ప్రకాశం బరాజ్ పశ్చిమ కాలువపై, ప్రకాశం బరాజ్ తూర్పు ప్రధాన కాలువ, కర్నూలు –కడప (కేసీ) కెనాల్.
మూడో దశలో అన్నీ ఏపీలోని ప్రాంతాలే..
మూడో దశలో 11 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ 11 ప్రాంతాలు కూడా ఏపీ భూభాగంలోనే ఉన్నాయి. తెలుగుగంగ ప్రాజెక్ట్ రెగ్యులేటర్, బనకచర్ల ఎస్కేప్ రెగ్యులేటర్, ఎస్‌ఆర్ బీసీ, గాలేరు నగరి, హంద్రీనీవా, కేసీ కెనాల్ లిఫ్ట్ (ముచ్చుమర్రి), హంద్రీనీవా లిఫ్ట్ స్కీమ్టు కేసీ కెనాల్ (మల్యాల), చెన్నముక్కపల్లి ఆఫ్టేక్, గురు రాఘవేంద్ర లిఫ్ట్, తుంగభద్ర హైలెవెల్ కెనాల్ (ఏపీ –కర్ణాటక బార్డర్), పోలవరం కుడి కాల్వలాంటి ప్రాంతాలున్నాయి. అవన్నీ ఏపీ పరిధిలోనే ఉన్నాయి. నిరుడు నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో మూడో దశ టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం రూ.4.18 కోట్ల నిధులు కూడా ఇచ్చింది. కానీ, తీరా ఇప్పుడు మాత్రం పెట్టబోమంటూ బోర్డు మొండికేస్తున్నది. ఇటు ఏపీ కూడా ముందుకు రావట్లేదు. అవన్నీ వారి భూభాగంలోనే ఉండడం, టెలిమెట్రీలు పెడితే తాము చేస్తున్న జలదోపిడీ అడ్డంగా బయటపడుతుం దన్న ఉద్దేశంతోనే ఏపీ ఈ విషయంలో తొండి చేస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు ఏపీ జలదోపిడీకి కృష్ణా బోర్డు ఇప్పటికే చాలాసార్లు పరోక్షంగా సహకరించిందన్న ఆరోపణలున్నాయి. తాజాగా టెలిమెట్రీలు పెట్టబోమని చెప్పడం ఆ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నది.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోనే స్పష్టం
బ్రజేశ్ ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యేంత వరకు టెలిమెట్రీలు పెట్టబోమని బోర్డు చెబుతున్నా.. అసలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోనే టెలిమెట్రీలు పెట్టాలన్న నిబంధన ఉన్నదని అధికారులు వాదిస్తున్నారు. ఔట్‌సైడ్ బేసిన్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వందల టీఎంసీల నీళ్లు తరలిపోతున్నాయని చెబుతున్నారు. రెండు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి లెక్కలు తీయడానికి టెలిమెట్రీలను ఏర్పాటు చేయాల్సిందేనని బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్ అవార్డులో స్పష్టంగా తీర్పునిచ్చిందని అంటున్నారు. తొలిదశలో బోర్డు ఆదేశాలతోనే టెలిమెట్రీలు పెట్టినప్పుడు.. ఇప్పుడు పెట్టొద్దంటే అప్పటి బోర్డు సభ్యులు, చైర్మన్ తీసుకున్నవి తప్పుడు నిర్ణయాలా? అని బోర్డును ప్రశ్నిస్తున్నారు.
