మిస్సింగ్ కేసులపై హైకోర్టు సీరియస్

మిస్సింగ్ కేసులపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లో నమోదవుతున్న మిస్సింగ్ కేసులుపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. రోజురోజుకూ మిస్సింగ్ కేసులు ఎక్కువవుతున్న తరుణంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. 8 వేల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి 2020 నవంబర్ వరకు మిస్సింగ్ కేసులు రెట్టింపు అయ్యాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీకి చెందిన మిస్సింగ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని పిటిషనీర్ వివరించారు. ఈ పిటిషన్ పై కౌంటర్ ధాఖలు చేసిన ప్రభుత్వం.. మిస్సింగ్ కేసుల మీద అన్ని చర్యలు తీసుకుంటున్నామని కోర్టుకు చెప్పింది. షీ-టీమ్, దర్పన్ యాప్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, ఆపరేషన్ ముస్కాన్ లాంటి కార్యక్రమాల ద్వారా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ప్రభుత్వ ప్రణాళిక ఏంటి?
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్‌‌ను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే ఇప్పటివరకు రాష్ట వ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసులపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారని, భవిష్యత్‌‌‌లో మిస్సింగ్ కేసులపై సర్కార్ ప్రణాళికలు ఏంటని క్వశ్చన్ చేసింది. ఏ వర్గాలకు చెందిన వారు ఎంతమంది అదృశ్యమయ్యారో విశ్లేషించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి స్పందనగా.. డిసెంబర్ 3న నివేదిక అందిస్తామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమాధానం చెప్పారు. ఈ కేసును డిసెంబర్ 10కి హైకోర్టు వాయిదా వేసింది.