తెలుగు బిగ్ బాస్: నాలుగు స్తంభాలాట

తెలుగు బిగ్ బాస్: నాలుగు స్తంభాలాట

అడవిలో దొంగ, పోలీస్ ఆట మూడో రోజుకి చేరింది. రెండు రోజుల పాటు జరిగిన రభస మూడో రోజు కూడా కంటిన్యూ అయ్యింది. మరి ఈ టాస్క్‌లో ఎవరి స్ట్రాటజీ ఫలించింది? విజయం ఎవరిని వరించింది? పోలీసులనా.. దొంగలనా?

రేవంత్ ఆవేశం.. నేహ ఆక్రోశం

బొమ్మలాట పెట్టిన చిచ్చు ఇవాళ కూడా మండుతూనే ఉంది. ఎపిసోడ్ మొదలవుతూనే నేహ నానా హంగామా చేసింది. మెరీనా రూల్స్ పాటించడం లేదంటూ గోల చేసింది. చేతికి తగిలిన దెబ్బకి మందు కోసం నా ర్యాక్ దగ్గరికి వెళ్లడం కూడా తప్పేనా అంటూ మెరీనా రివర్సయ్యింది. ప్రతిదానికీ డుర్‌‌ డుర్‌‌ అంటే కుదరదు అంటూ నేహపై సెటైర్లు వేసింది. అసలీ గేమ్ ఫెయిర్‌‌గానే లేదని, అందరూ తప్పుగా ఆడుతున్నాడని రేవంత్ మరోసారి ఆవేశపడ్డాడు. అలా చేయొచ్చదంటూ నేహ చెబుతుంటే నొచ్చుకున్నాడు. ఇక ఇనయా బాధ వేరే. మిగతావాళ్లు కూడా మోసం చేసి ఆడుతున్నారు కాబట్టి తానూ అలాగే ఆడాలనుకున్నాను తప్ప ఎవరినీ హర్ట్ చేసే ఉద్దేశం లేదంటూ మరోసారి కన్నీళ్లు కుమ్మరించింది. ఏదైతేనేం.. టాస్క్ అయితే ముగిసింది. పోలీసుల టీమ్ విజయం సాధించింది. 

నాలుగు స్తంభాలాట

ఈవారం కెప్టెన్సీ పోటీకి నలుగురు సెలెక్ట్ అయ్యారు. ఆట ముగిసే సమయానికి పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు, యాభయ్యొక్క బొమ్మలు గీతూ దగ్గర ఉండటంతో ఆమెను కెప్టెన్సీ పోటీకి ఎంపిక చేశాడు బిగ్‌బాస్. అలాగే బంగారు కొబ్బరి బొండం శ్రీసత్య దగ్గర ఉండటంతో తను కూడా పోటీకి అర్హురాలేనని ప్రకటించాడు. ఆ తర్వాత అందరూ కాసేపు డిస్కషన్‌లోకి దిగారు. ఆటలో ఎవరేం చేశారు, ఏది ఎలా జరిగిందంటూ ముచ్చట్లాడుకున్నారు. కొందరు తిట్టుకున్నారు. కొందరు నవ్వుకున్నారు. మరికొందరు కుమిలిపోయారు. ఇంకొందరు రగిలిపోయారు. ఆ తర్వాత బెస్ట్ పర్‌‌ఫార్మర్స్ని సెలెక్ట్ చేయమని బిగ్‌బాస్ చెప్పడంతో.. గీతు, శ్రీసత్యలతో పాటు ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహాన్ కూడా లిస్టులో చేరారు. వీళ్లకి మరో టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. దూరంగా ఉన్న బ్రిక్స్ని తెచ్చి అందరూ టేబుల్‌ మీద పిరమిడ్‌లా పేర్చాలి. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరూ వాటిని బాల్స్తో కొడతారు. బజర్ మోగే సమయానికి ఎవరి బ్రిక్స్ ఎక్కువగా నిలబడి ఉంటాయో వాళ్లే విజేత. అయితే ఈ ఆటలో ఓ విచిత్రం జరిగింది. టాస్కుల్లో గెలవడానికి ఎంతకైనా తెగించే గీతూ నేను ఆడలేనంటూ మధ్యలోనే ఓటమి అంగీకరించింది. దాంతో మిగతా నలుగురూ పోటీపడ్డారు. బజర్ మోగే సమయానికి ఫైమా పిరమిడ్‌లో ఎక్కువ బ్రిక్స్ మిగిలాయి. కానీ ఆమె రూల్స్ని బ్రేక్ చేసి చేతితో ఒక బ్రిక్‌ని తోయడంతో డిస్‌క్వాలిఫై చేశాడు సంచాలకుడు రేవంత్. నేనలా చేయలేంటూ ఫైమా ఎంత గొంతు చించుకున్నా అతను తన నిర్ణయంపై స్టాండ్ అయ్యాడు. మిగతా ముగ్గురినీ నెక్స్ట్ రౌండ్‌కి క్వాలిఫై చేశాడు. 

తిండి కోసం తిప్పలు

బిగ్‌బాస్ హౌస్‌లో కావలసినంత తిండి దొరకదనే విషయం అందరికీ తెలిసిందే. పైగా ఈవారం లగ్జరీ బడ్జెట్ కూడా లేదాయె. అందుకే రేషన్ మేనేజర్ సుదీప ఎంతో జాగ్రత్తగా ఫుడ్‌ని అందరికీ అందేలా చేస్తోంది. అయితే ఒక విషయంలో రేవంత్ హర్ట్ అయిపోయాడు. ఇలా తింటే మనుషులకైతే కడుపు నొప్పి వస్తుంది, రేవంత్‌ కాబట్టి రాదు అంది, అంటే నేను మనిషిని కాదనా అంటూ అందరి దగ్గరా పంచాయతీ మొదలెట్టాడు. తను అలా అన్నందుకు హర్ట్ అయ్యి రాత్రి అన్నం కూడా తినలేదంటూ వాపోయాడు. ఆ కోపాన్ని చివరికి సుదీప మీద కూడా చూపించడంతో ఆమె ఘాటుగా రియాక్టయ్యింది. తాను అలా అనలేదని, అసలు మనుషులు అనే మాటే ఉపయోగించలేదని అంది. అయినా వినకుండా రేవంత్ తిట్టుకుంటూ వెళ్లి మైక్ తీసి దూరంగా విసిరేశాడు. రేషన్ మేనేజర్‌‌గా తాను ఎంతో జాగ్రత్త పడుతున్నానని, అందరూ కో ఆపరేట్ చేస్తున్నా రేవంత్ మాత్రం తనకి ఏది నచ్చితే అది తీసేసుకుంటున్నాడని, అయినా తాను ఏమీ అనడం లేదని, ఇలా మాట్లాడితే తానూ అవన్నీ చెప్పాల్సి వస్తుందని అరిచింది. సుదీప్ మాటలు నిజమేనని, ఆమె రేవంత్ గురించి తప్పుగా అనలేదని మెరీనా సమర్థించింది.

రాజ్‌కి స్వయంవరం.. అర్జున్‌కి కలవరం

ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ప్రేమ కథలు కూడా బాగానే నడుస్తున్నాయి. ఆరోహి, సూర్య.. అర్జున్, శ్రీసత్యల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందంటూ ఇప్పటికే ఆడియెన్స్ కనిపెట్టేశారు. ఇవాళ్టి ఎపిసోడ్‌తో వాళ్ల అనుమానం నిజమేనని మరోసారి ప్రూవ్ అయ్యింది. శ్రీహాన్ కారణంగా ఆటలో ఆరోహి హర్ట్ అయ్యిందంటూ సూర్య తెగ ఆవేదన చెందుతున్నాడు. ఏం జరిగిందో ఫైమాతో చెప్పి ఫీలయ్యాడు. ఆ తర్వాత ఆరోహి దగ్గర కూర్చుని, ఏడుస్తున్న ఆమెని దగ్గరకు తీసుకుని కాసేపు ఓదార్చాడు కూడా. ఇక అర్జున్‌, శ్రీసత్యల గురించి శ్రీహాన్, నేహ డిస్కషన్ పెట్టుకున్నారు. వాళ్ల మధ్య ఏముంది అంటూ నేహ అమాయకంగా అడిగినట్టు బిల్డప్ ఇస్తే..  అర్జున్‌కి శ్రీసత్య మీద ఫీలింగ్స్ ఉన్నాయని, తనేమో పట్టించుకోవట్లేదని శ్రీహాన్ జడ్జిమెంట్‌ ఇచ్చాడు. అతను వసంతిని కూడా అలాగే చూస్తున్నాడని.. డబుల్‌ గేమ్ ఆడుతున్నాడా, ట్రయాంగిల్ లవ్‌స్టోరీ నడుస్తుందా అంటూ కొత్త కథకి తెర తీసింది నేహ. కాస్త కంట్రోల్ చేసుకోమంటే అతను వినడం లేదని, అన్నయ్య అని పిలవనా అని శ్రీసత్య అడిగినా సరే అనడం లేదని  శ్రీహాన్‌ అన్నాడు. వాళ్లు షో కోసం ఇదంతా చేస్తున్నారని నాకపిస్తోంది అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది నేహ. ఆ తర్వాత టేబుల్ దగ్గర కూర్చుని అందరూ పని చేస్తున్నప్పుడు ఈ ఇంట్లో ఉన్న పెళ్లికాని అమ్మాయిల్లో నీకు ఎవరంటే ఇష్టమో చెప్పమని రాజ్‌ని అడిగింది శ్రీసత్య. అతను శ్రీసత్య అంటేనే ఇష్టమన్నాడు. దాంతో నేహ మధ్యలో దూరిపోయి.. రాజ్‌ ఆమె పేరు చెప్పగానే అర్జున్ అక్కడి నుంచి తొంగి చూస్తున్నాడు అంటూ గోల చేసింది. అర్జున్ ముఖంలోనూ  జెలసీ కొట్టొచ్చినట్టు కనబడింది. దాంతో అందరూ కాసేపు హాయిగా నవ్వుకున్నారు. 

ఇనయా ఫైరింగ్.. గీతూ ర్యాగింగ్

ఏ వంక దొరుకుతుందా, ఎవరితో గొడవ పెట్టుకుందామా అని చూసే ఇనయాకి ఇవాళ శ్రీహాన్ దొరికాడు. కెప్టెన్సీ టాస్క్ మొదటి రౌండ్‌లో ఫైమాని సపోర్ట్ చేసింది ఇనయా. దాని గురించి సంచాలకుడైన రేవంత్‌తో ముచ్చట పెట్టింది. ఆ ప్రయత్నంలో శ్రీహాన్ కూడా చేతితో బ్రిక్‌ని నెట్టాడని చెప్పే ప్రయత్నం చేసింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీహాన్.. ఏ పిట్ట వచ్చి ఏం కూసినా సంచాలకుడిగా నీ నిర్ణయం నువ్వు తీసుకో అని రేవంత్‌తో చెప్పాడు. అంతే.. ఇనయా ఫైర్ అయిపోయింది. నన్ను పిట్ట అంటావా అంటూ ఇల్లు అదిరిపోయేలా అరవడం మొదలుపెట్టింది. నేను నిన్ను అనలేదని అతను ఎంత చెప్పినా వినకుండా అరుస్తూనే ఉంది. దాంతో శ్రీహాన్ కూడా వాయిస్ పెంచాడు. కానీ ఇనయా ధాటికి తట్టుకోలేక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అయినా అతని వెంటపడి గొడవ చేస్తూనే ఉంది ఇనయా. దాంతో గీతూ సీన్‌లోకి ఎంటరయ్యింది. అతను అన్నది నిన్ను కాదు నన్ను, అక్కడ నేను కూడా ఉన్నాను అని ఆమె ఎంత చెబుతున్నా ఇనయా వినలేదు. నిన్ను కాదు నన్నే అన్నాడు అంటూ జరిగింది తవ్వుతూనే ఉంది. మధ్యలో టాస్క్ రిజల్ట్ అనౌన్స్ చేయడం కోసం బ్రేక్ ఇస్తే కాసేపు ఆపింది. అదవ్వగానే మళ్లీ అందుకోవడంతో శ్రీహాన్ భయపడి పారిపోయాడు. తను మగాళ్లని వాడూ వీడూ అనొచ్చు, దొంగాటలు ఆడేయొచ్చు కానీ పిట్ట అనడం తప్పైపోయిందా అంటూ ఫీలయ్యాడు. ఇనయా ఇంకా ఇంకా కేకలేస్తూనే ఉండటంతో.. పిట్టంటే తప్పు మాట కాదమ్మా, స్పారో అంటారు దాన్ని, చిన్నగా ముద్దుగా ఉంటుంది, అందమైన అమ్మాయిల్ని పిట్ట అంటారు అంటూ టీజ్ చేయడం మొదలుపెట్టింది గీతూ. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను వినను, వెళ్లు అని ఇనయా విసుక్కోవడంతో పక్కనే ఉన్న వసంతి దగ్గరికెళ్లి.. పిట్ట అని అందమైనవాళ్లని అంటారే వసూ, నిన్నెవరే పిట్ట అనేది అంటూ కావాలని కామెంట్ చేసింది గీతూ. చాలాసేపు ఇనయాని తనదైన స్టైల్లో ర్యాగింగ్ చేసి వెళ్లిపోయింది. నామినేషన్ల టైమ్‌లో తనని మాట్లాడనివ్వనందుకే ఇలా ఏడిపించానని, ఇప్పుడు తృప్తిగా ఉందని గీతూ తనదైన స్టైల్లో చెప్పడం అందరినీ కడుపుబ్బ నవ్వించింది. 

మొత్తానికి కొన్ని గొడవలు, కొన్ని నవ్వులు.. కొన్ని ప్రేమలు, కొన్ని ద్వేషాలతో ఇవాళ హౌస్‌ కాసింత కొత్తగా కనిపించింది. రేపు కెప్టెన్సీ టాస్క్ రెండో రౌండ్ జరగబోతోంది. ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య పోటీ పడబోతున్నారు. మరి వీరిలో చివరి వరకు నిలబడేదెవరో, కెప్టెన్ అయ్యేదెవరూ చూడాలి.