ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ పై ప్రశంసలు

ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ పై ప్రశంసలు

ఈ ఏడాది బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నాటునాటు పాటకు అవార్డును అందుకున్న‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలపారు.  చరిత్రలో మరుపురాని పాటగా ఇది నిలిచిపోతుందని, ఏళ్ల తరబడి ఈ పాటను గుర్తు చేసుకుంటూనే ఉంటారని మోడీ  కితాబిచ్చారు. కీరవాణి, చంద్రబోస్‌లతో పాటు మొత్తం చిత్ర బృందానికి  ఈ సందర్భంగా మోడీ​ అభినందనలు తెలిపారు. అదేవిధంగా బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్న ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ చిత్ర బృందాన్ని కూడా  మోడీ అభినందించారు. 

నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది : కేసీఆర్‌ 


నాటునాటు పాటకు ఆస్కార్‌ దక్కడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణమని కొనియాడారు. నాటు నాటు పాట తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టిందని, తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శనమని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ పాట ద్వారా తెలుగులోని మట్టి వాసనలను గీత రచయిత చంద్రబోస్‌ వెలుగులోకి తీసుకొచ్చారని కేసీఆర్‌ అన్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇవాళ పండగ రోజని, ఆస్కార్‌ స్ఫూర్తితో ఇదే ఒరవడి కొనసాగాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. 

తెలుగు జెండా రెపరెపలాడుతోంది : జగన్ 


నాటునాటు పాటకు ఆస్కార్‌ దక్కడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందని ట్వీట్ చేశారు. మన జానపద వారసత్వాన్ని ఎంతో అందంగా జరుపుకునే తెలుగు పాట పట్ల తాను గర్వపడుతున్నాను, ఈ రోజు అంతర్జాతీయంగా దానికి తగిన గుర్తింపు లభించిందని జగన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు ప్రజలను, భారతీయులందరికీ గర్వకారణంగా చేసినందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి అభినందనలు తెలపారు.