అమెరికాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు షాక్.. వెనక్కు పంపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

అమెరికాలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు షాక్.. వెనక్కు పంపిన ఇమ్మిగ్రేషన్ అధికారులు

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెనక్కి పంపించారు. ఈ విద్యార్థులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినా.. విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లు తీసుకున్నాక కూడా ఇమ్మిగ్రేషన్ తనిఖీల తర్వాత వెంటనే వెనక్కి పంపారు. అమెరికాలోని అట్లాంట, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలలోని యూనివర్సిటీల్లో చదివేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులను సరైన కారణాలు చెప్పకుండా వెనక్కి పంపారు. భారత్‌కు తిప్పి పంపిన 21 మంది విద్యార్థులు ఐదేళ్లపాటు పాటు అమెరికాలోకి రాకుండా వారిపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది.  తాము అన్ని వీసా ఫార్మాలిటీలను పూర్తి చేశామని, ఉన్నత చదువుల కోసం తమ కళాశాలలకు చేరుకోవడానికి యుఎస్‌లో అడుగుపెట్టమని పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక వారిని వెనక్కి పంపించారు. వారిలో ఎక్కువ మంది అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు.

తమను ఎందుకు వెనక్కి పంపారనే దానిపై సరైన సమాచారం ఇవ్వలేదని, వీసా డాక్యుమెంటేషన్‌తో దీనికి సంబంధం ఉందని విద్యార్థులు చెప్పారు. కొంతమంది విద్యార్థులకు సంబంధించిన ఫోన్లు, వాట్సాప్ చాట్‌లను కూడా తనిఖీ చేసినట్లు చెప్పారు. సైలెంట్ గా వెళ్లిపోవాలని.. అభ్యంతరాలు తెలిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిస్సౌరీ, సౌత్ డకోటా రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలలో చేరడానికి వెళుతున్నామని బాధిత విద్యార్థులు చెప్పారు. సమయం, డబ్బు వృధా అవ్వడమే కాకుండా భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందని విద్యార్థులు వాపోయారు. భార‌త విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాల‌ని కోరుతున్నారు.