- సర్టిఫికెట్లు కావాలంటే డీడీ తీయాల్సిందే
- బాచుపల్లి క్యాంపస్ దరిదాపుల్లో లేని బ్యాంకులు
- ఆన్‌లైన్ ఫీజుకు ససేమిరా అంటున్న వర్సిటీ
హైదరాబాద్, వెలుగు: ప్రపంచమంతా డిజిటల్ మయమై.. చిరు వ్యాపారుల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు ఆన్‌లైన్ లావాదేవీలకే ప్రాధాన్యమిస్తుంటే.. ప్రతిష్టాత్మక సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ మాత్రం ఇంకా పాతకాలపు పద్ధతులకే పరిమితమైంది. కాలం మారుతున్నా.. టెక్నాలజీ పెరుగుతున్నా వర్సిటీ అధికారులు మాత్రం అప్‌డేట్ కావడం లేదు.
వర్సిటీ అధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీనత విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) సమర్పించాల్సిందేనని మొండికేస్తున్నారు. దీంతో డీడీల కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మూడేండ్ల కిందట తెలుగు వర్సిటీ మెయిన్ క్యాంపస్‌ను నాంపల్లి నుంచి నిజాంపేట బాచుపల్లికి తరలించారు. దాదాపు ప్రతీ వర్సిటీ ప్రాంగణంలో ఓ బ్యాంకు శాఖ ఉంటుంది.
కానీ, బాచుపల్లి క్యాంపస్ లోనే కాదు.. దాని దారిదాపుల్లో కూడా బ్యాంకులు అందుబాటులో లేవు. డీడీ తీయాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. సాధారణంగా డీడీ తీయాలంటే సదరు బ్యాంకులో అకౌంట్ ఉండటంతో పాటు చెక్కు బుక్కు తప్పనిసరి అని బ్యాంకులు నిబంధనలు పెడుతున్నాయి. నగదు తీసుకుని డీడీలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో అకౌంట్ లేని విద్యార్థులు, చెక్ బుక్ అందుబాటులో లేని వారు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.
సర్టిఫికెట్ కోసం వర్సిటీకి వస్తే.. డీడీ కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తీరా డీడీ తీసుకుని క్యాంపస్‌కు వస్తే.. సంబంధిత అధికారులు సీట్లలో ఉండటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగర శివారుల్లోని బాచుపల్లికి వెళ్తే.. అధికారులు నాంపల్లికి వెళ్లారంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉండే కొద్దిమంది కిందిస్థాయి సిబ్బంది కూడా సాయంత్రం 4 గంటల నుంచే ఇంటికి పోయే హడావుడిలో ఉండి.. ‘ఇవ్వాల పని కాదు.. రేపు రండి’ అంటూ విద్యార్థులను తిప్పించుకుంటున్నారు.
- హాల్ టికెట్లూ చేతిరాతోనే..
తెలుగు యూనివర్సిటీలో పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ మాత్రమే ఆన్‌లైన్‌లో ఉంది. అది కూడా వర్సిటీకి వెళ్లి అక్కడే స్కాన్ చేయాల్సి ఉంటుంది. అయితే, హాల్ టికెట్లు మాత్రం చేతిరాతతోనే ఇస్తుండటం గమనార్హం. డిజిటల్ యుగంలోనూ సర్టిఫికెట్లు కావాలంటే వర్సిటీలో ఆన్ లైన్లో అప్లై చేసుకునే అవకాశం లేదు. చేతిరాతితోనే రాసి ఇవ్వాల్సి ఉంది. హాస్టల్లో విద్యార్థులు లేకపోయినా.. నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే.
దీనికోసం మళ్లీ వర్సిటీ ప్రాంగణం బయట ఉన్న ‘హాస్టల్’ చీఫ్ వార్డెన్ ఆఫీసుకు రావాల్సిందే. ఆయనకు ఇతర శాఖల బాధ్యతలు ఉండటంతో.. ఆ ఆఫీసుకు ఆయన రెగ్యులర్ గా రావట్లేదనే ఆరోపణలున్నాయి. ఇదే విధానంలో లైబ్రరీ నో డ్యూ సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. అయితే, లైబ్రరీ బుక్కుల్లో సిబ్బంది నిర్లక్ష్యంతో చాలామంది విద్యార్థుల పేర్లు రాయలేదు. దీంతో పేర్లు లేవనే సాకుతో గంటల తరబడి సతాయిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఆన్‌లైన్ పేమెంట్లకు ఏమైంది..?
రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు ఆన్ లైన్లోకి మారాయి. కానీ, తెలుగు వర్సిటీ మాత్రం ఆ వైపు పోవాలనే ఆలోచన కూడా చేయడం లేదు. ఇతర వర్సిటీలు ఫీజుల చెల్లింపు కోసం ఆన్‌లైన్ పోర్టల్స్, క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తెస్తుంటే.. తెలుగు వర్సిటీ మాత్రం ఇంకా డీడీల దగ్గరే ఆగిపోయింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తే విద్యార్థులకు ఈ కష్టాలు తప్పుతాయని, సమయం కూడా ఆదా అవుతుందని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, వర్సిటీ ఎగ్జామినేషన్, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయాలని, ఇబ్బందులను తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు.
