తెలంగాణలో పడిపోతున్న టెంపరేచర్లు.. సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్స్‌‌కు జనం క్యూ

తెలంగాణలో పడిపోతున్న టెంపరేచర్లు.. సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్స్‌‌కు జనం క్యూ
  • సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్స్‌‌కు క్యూ కడ్తున్న జనం
  • పలు జిల్లాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
  • సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్స్‌‌కు క్యూ కడ్తున్న జనం
  • పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని చలి వణికిస్తున్నది. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌‌కు పడిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యల్పంగా 10.2 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్‌‌లో 10.4, కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌లో 10.9, సంగారెడ్డిలో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఈ  వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ ప్రజలు పెద్ద సంఖ్యలో దవాఖానలకు క్యూ కడుతున్నారు. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్‌‌‌‌లోని ఉస్మానియాలో 2,536, గాంధీలో 2,397, నీలోఫర్‌‌‌‌లో 1,196, ఆదిలాబాద్ రిమ్స్‌‌‌‌లో 1,341, నిజామాబాద్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్‎లో 1,732, నల్గొండ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్‌‌‌‌లో 967,  కరీంనగర్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్‌‌‌‌లో  807, భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్‌‌‌‌లో 710, కేఎంసీలో 2,084, సూర్యాపేట్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్‌‌‌‌లో 963, ఫీవర్ హాస్పిటల్‌‌‌‌లో 527, మహబూబాబాద్ టీచింగ్ హాస్పిటల్‌‌‌‌లో 913  ఓపీ కేసులు నమోదయ్యాయి.   

పిల్లలకు న్యుమోనియా సోకే ప్రమాదం 

చలి అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతున్నప్పటికీ..  ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందులు ఉంటాయని  డాక్టర్లు చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారని, జలుబు, గొంతునొప్పి నుంచి మొదలై న్యుమోనియా, బ్రాంకైటిస్‌‌‌‌లాంటి తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. పిల్లలకు పొరలు పొరలుగా వెచ్చని దుస్తులు వేయాలని, తల, చెవులు, పాదాలను కప్పి ఉంచేలా టోపీలు, సాక్సులు తప్పనిసరిగా వాడాలని సూచిస్తున్నారు. కూల్‌‌‌‌డ్రింక్స్‌‌‌‌, ఐస్‌‌‌‌క్రీమ్‌‌‌‌లకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు. 

గర్భిణులకు ఇన్ఫెక్షన్ల చాన్స్​

ఈ కాలంలో గర్భిణుల్లో ఇమ్యూనిటీ బలహీనపడటం వల్ల ఇన్ఫెక్షన్లు వేగంగా సోకే చాన్స్‌‌‌‌ ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. బీపీ, కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్నోళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవడంతోపాటు స్నానానికి, తాగడానికి గోరువెచ్చని నీటినే ఉపయోగించాలని,  విటమిన్- సీ ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయిలాంటి పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.  

వృద్ధులకు గుండెపోటు ముప్పు

చలి తీవ్రతకు ఎక్కువగా ప్రభావితమయ్యేది వృద్ధులేనని, గుండె సంబంధిత సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చలికి రక్తనాళాలు కుంచించుకుపోయి.. బీపీ పెరిగి గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే, బాడీ టెంపరేచర్ ప్రమాదకరస్థాయికి పడిపోయే ‘హైపోథెర్మియా’ ముప్పు కూడా ఎక్కువేనని చెబుతున్నారు. వృద్ధులు ఉదయాన్నే వాకింగ్‌‌‌‌కు వెళ్లడం మానుకొని, ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయాలని,  బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు క్రమం తప్పకుండా వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

 గోరువెచ్చని నీళ్లు తాగాలి

చలికాలంలో సాధారణంగా దాహం తక్కువగా వేస్తుంది.. కానీ శరీరానికి తగినంత ద్రవాలు అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. దాహం వేయకపోయినా తరచుగా గోరువెచ్చని నీళ్లు, సూప్‌‌‌‌లు, హెర్బల్ టీ లాంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా.. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందని చెబుతున్నారు. 

చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు, కొబ్బరి నూనె వాడాలని,  వేడిగా, తాజాగా వండిన ఆహారాన్నే తినాలని, నిల్వ ఉన్న, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టడానికి చేతులను తరచూ సబ్బుతో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. 

 మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల శ్వాసకోశ, గుండె సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా  వెంటనే డాక్టర్లను సంప్రదించి, చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

బాడీ టెంపరేచర్లు తగ్గకుండా చూసుకోవాలి 

చలికాలంలో రెస్పిరేటరీ వైరస్‌‌‌‌లు వృద్ధి చేందే అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తమా, లంగ్స్ ప్రాబ్లమ్ ఉన్నోళ్లు బాడీ టెంపరేచర్లు తగ్గకుండా చూసుకోవాలి. ఇమ్యూనిటీ బలహీనపడకుండా బ్యాలెన్స్‌‌‌‌డ్‌‌‌‌ డైట్ మెయింటెయిన్‌‌‌‌ చేయాలి. ఫ్లూ వ్యాక్సిన్ ఏడాదికి ఒకసారి తీసుకోవడం వల్ల వైరస్‌‌‌‌లు దరిచేరవు.  బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌ పేషెంట్లు వాటిని కంట్రోల్‌‌‌‌లో పెట్టుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్ సాధ్యమైనంత వరకు తగ్గించాలి. జ్వరం, ఫ్లూ లక్షణాలు ఉంటే ఫ్యామిలీ మెంబర్లకు స్ప్రెడ్ కాకుండా మాస్కులు ధరించాలి. అనుమానం ఉంటే డాక్టర్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించాలి. 
– డాక్టర్ రాజారావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్