అసెంబ్లీలో కమీషన్ల లొల్లి.. భట్టి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం

అసెంబ్లీలో కమీషన్ల లొల్లి.. భట్టి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
  • డిప్యూటీ సీఎం భట్టి, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
  • ప్రభుత్వంలో పనులు కావాలంటే 30% కమీషన్లు అడుగుతున్నరు: కేటీఆర్
  • బిల్లుల క్లియరెన్స్‌‌‌‌కు 20% కమీషన్లు డిమాండ్​ చేస్తున్నరని ఆరోపణలు
  • దమ్ముంటే.. ఆరోపణలు  నిజమని నిరూపించండి: భట్టి
  • మీరే వేల కోట్ల బిల్లులు పెండింగ్‌‌‌‌లో పెట్టి వెళ్లారు  
  • మైక్ ఇచ్చారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు
  • ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని డిప్యూటీ సీఎం  హెచ్చరిక 
  • కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్.. 
  • భట్టి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ 
  • కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటన
  • సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. ఎంట్రీ పాయింట్ వద్ద నిరసన

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కమీషన్లు తీసుకుంటున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో అసెంబ్లీలో దుమారం రేగింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బుధవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న టైమ్‌‌లో మంత్రులు జోక్యం చేసుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంలో పనులు కావాలంటే 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. ఈ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని సెక్రటేరియెట్‌‌లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి ఫైర్..  

కేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్‌‌‌‌కు దమ్ముంటే.. ఆయన చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. ‘‘మీ పాలనలో రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లంతా సెక్రటేరియెట్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లు బిల్లుల కోసమే ధర్నా చేశారు తప్ప మరొకటి కాదు. మీ పాలనలో లక్షల కోట్ల అప్పులు చేశారు.. వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు. మీరు చేసిన పాపం వల్ల బిల్లులు రాక కాంట్రాక్టర్లు బాధ పడుతున్నరు. మేం విడతల వారీగా బిల్లులు చెల్లిస్తూ ముందుకుపోతున్నం. మీరు అడ్డగోలుగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. నేను మీకు చాలెంజ్ చేస్తున్నా.. మీరు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించండి. లేదంటే అసెంబ్లీకి , రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి” అని అన్నారు. ‘‘మేం మీలాగా రాష్ర్టం మీద పడి బరితెగించి దోచుకోలేదు. బాధ్యతగా పాలన చేస్తున్నాం. మీలాగా అడ్డగోలు పనులు చేసి రాష్ర్టాన్ని దోపిడి చేయలేదు. మైక్ ఇచ్చారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి” అని భట్టి హెచ్చరించారు. ప్రతి అంశంపై అబద్ధాలు చెబుతూ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, అంతకుముందు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సివిల్స్ అభ్యర్ధులకు రాజీవ్ గాంధీ అభయ హస్తం కింద రూ. 4 కోట్లు ఇచ్చి రూ. 40 కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టారని ఆరోపించారు. దీనిపై భట్టి స్పందిస్తూ.. ‘అలా చేసినట్టు పల్లా చూశారా? ఇలాంటి వ్యాఖ్యలు చేసి అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారు” అని భట్టి ఫైర్ అయ్యారు.  

ఆది శ్రీనివాస్ వర్సెస్ కేటీఆర్..

కమీషన్ల అంశంపైనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్ సభ్యులు వీడియోలు, ఫొటోలు తీసుకుంటున్నారు. వాట్సాప్‌‌లో పోస్ట్ చేస్తున్నారు. సభ జరుగుతున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధం. కానీ ఎమ్మెల్యేలు అదే పనిగా అలా చేస్తున్నారు” అని స్పీకర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. ‘‘కె అంటే కమీషన్ కాళేశ్వరం, కె అంటే కమీషన్ కాకతీయ, కె అంటే కమీషన్ కరెంట్ కొనుగోలు. అవినీతి, అక్రమాలకు పాల్పడడంతోనే బీఆర్ఎస్‌‌ను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఒక్క ఐడియాతో జీవితం మారిపోయినట్టు.. బీఆర్ఎస్ నేత లిక్కర్ స్కామ్ ఐడియాతో ఢిల్లీలో ప్రభుత్వం పడిపోయింది” అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. దళితుడు డిప్యూటీ సీఎంగా ఉంటే బీఆర్ఎస్ సభ్యులు ఓర్వడం లేదని మండిపడ్డారు. అయితే ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.

 ‘‘2009 నుంచి భట్టితో క‌‌లిసి ప‌‌ని చేస్తున్నాం. ఆయ‌‌న డిప్యూటీ స్పీక‌‌ర్‌‌గా ఉన్నప్పుడు నేను తొలిసారి ఎమ్మెల్యేగా వ‌‌చ్చాను. భట్టితో మాకు ఫ్రెండ్‌‌షిప్ ఉంది. ఆయన అంటే గౌర‌‌వం ఉంది. పెద్దన్నలాగా గౌర‌‌విస్తాం” అని తెలిపారు. ‘‘30 శాతం క‌‌మీష‌‌న్లు తీసుకుంటున్నార‌‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డే అన్నారు. 20 శాతం క‌‌మీష‌‌న్లు తీసుకుంటున్నార‌‌ని కాంట్రాక్టర్లు సెక్రటేరియెట్‌‌లో ధ‌‌ర్నా చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలనే కోరాం. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అని మేం అనలేదు. రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుకున్నాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్న మాటలు మేం అనలేమా?’’ అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో మళ్లీ దుమారం రేగింది. ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోయారు.

పోటాపోటీ నినాదాలు.. 

కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. అయితే ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటూ భట్టి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణ చెప్పాలంటూ వెల్‌‌లోకి దూసుకొచ్చారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ సభ్యుల పోటాపోటీ నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ టైమ్‌‌లోనే భట్టి మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీలో ప్రతి సభ్యుడు బాధ్యతగా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని అన్నాను. అది తప్పు ఎలా అవుతుంది?” అని ప్రశ్నించారు.

దళిత లీడర్‌‌‌‌ను  బీఆర్ఎస్ ఓర్వట్లేదు: పొన్నం 

దళిత లీడర్‌‌‌‌ అయిన భట్టిని బీఆర్ఎస్ ఓర్వడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ‘‘గతంలో దళితుడు (భట్టి విక్రమార్క) సీఎల్పీ లీడర్‌‌‌‌గా ఉంటే, అప్పటి ప్రభుత్వం ఓర్వలేకపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు దళితుడు ఆర్థిక మంత్రిగా ఉంటే ఓర్వడం లేదు. నోరు అదుపులో పెట్టుకోండి.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి అని అనడం సాధారణ వ్యాఖ్యలే” అని అన్నారు.