
- సర్వే పూర్తి.. కమిషన్ ఆఫీసుకు నివేదిక
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 205 దరఖాస్తులు
భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధూప, దీప, నైవేద్యం స్కీం కోసం దేవాలయాలు నిరీక్షిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఎంపికైన ఆలయాలకు నెలకు రూ.10వేలు చొప్పున నిధులు ఇస్తారు. రూ.6వేలు అర్చకుడికి వేతనంగా, రూ.4వేలు స్వామి నిత్య కైంకర్యాలు, పడితరం(పూజల నిర్వహణ)కు ఖర్చు చేస్తారు.
ఎండోమెంట్ పరిధిలో ఈ ఆలయాల నిర్వహణ జరుగుతుంది. మే 2న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఆలయాల ఎంపిక కోసం నోటిఫికేషన్ వచ్చింది. గ్రామీణప్రాంతాల్లోని పురాతన, చారిత్రక దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా ధూప,దీప, నైవేద్యం స్కీంను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఖమ్మం జిల్లాలో 140, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 65 దరఖాస్తులు వచ్చాయి.
క్షేత్రస్థాయిలో పరిశీలన
వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఆలయాల పరిస్థితి గురించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. 19 మంది అర్చకులు, 9 మంది ఆఫీసర్లతో ఒక కమిటీని ఇందు కోసం ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లోని ఆఫీసర్లు టీమ్లుగా విడిపోయి సర్వే నిర్వహించారు. ఆలయం స్థితిగతులు, పురాతనమైనదా? చారిత్రక నేపథ్యం, ఆలయానికి ఉన్న ఆస్తిపాస్తులు, భూములు, నిత్య దీపారాధనలు జరుగుతున్నాయా.. లేదా? పనిచేసే అర్చకుడు, పూజ నిర్వహణలో ఆయనకున్న సామర్ధ్యాలు ఇలా అనేక కోణాల్లో వివరాలు సేకరించారు.
సర్వేలో సేకరించిన వివరాలతో కూడిన నివేదికలతో పాటు, ఆలయాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ద్వారా హైదరాబాద్లోని ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసుకు తుది నివేదికలు వెళ్లాయి. కమిషనర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.
చిన్న దేవాలయాలకు మంచి రోజులు
నిత్యం చిన్న దేవాలయాల్లో ఆరాధనలతో హిందూ ధర్మ ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. ధూప, దీప, నైవేధ్యం స్కీం వల్ల చిన్న దేవాలయాలకు మంచి రోజులొస్తాయి. అర్చకులకు కూడా ఉపాధి దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఆలయాలు బాగుపడతాయి.- చారుగుళ్ల శ్రీనివాసరావు, భద్రాచలం
త్వరలో వివరాలు వెల్లడిస్తారు
నైవేద్యం స్కీం కోసం వచ్చిన దరఖాస్తుల ను కమిషనర్ కార్యాలయానికి పంపించాం. వారు ఎంపిక చేసిన ఆలయాల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఎన్నికైన ఆలయాలకు నెలకు రూ.10వేల వరకు నిధులు వస్తాయి. - వీరస్వామి, ఏసీ, ఎండోంమెంట్, ఖమ్మం