ఆ ఒప్పందం తాత్కాలికమే..కృష్ణానది జలాల పంపకాలపై ఏపీ

ఆ ఒప్పందం తాత్కాలికమే..కృష్ణానది జలాల పంపకాలపై ఏపీ
  • ట్రిబ్యునల్​లో పక్క రాష్ట్రం వాదనలు
  •  ఒప్పందాలు టెంపరరీ అయినా వాటినే కొనసాగించాలని పట్టు

హైదరాబాద్, వెలుగు: కృష్ణానదీ జలాల పంపకాలు (66:34) తాత్కాలికమేనని పొరుగు రాష్ట్రం ఏపీ ఒప్పుకున్నది. అయితే, దశాబ్దాలుగా వస్తున్న ఆ ఒప్పందాన్నే కొనసాగించాలంటూ వాదించింది. నీటి వాటాల పంపిణీపై బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్​లో బుధవారం ఏపీ వాదనలు కొనసాగాయి. 

బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు (ఉమ్మడి ఏపీలో) గంపగుత్తగా కేటాయించిందని పేర్కొన్నది. అయితే, రీజియన్ల వారీగా తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చేలా ఇరు రాష్ట్రాల మధ్య 2015లో ఒప్పందం జరిగిందని తెలిపింది. అది తాత్కాలిక ఒప్పందమేనని, అయితే.. దశాబ్దాలుగా ఇవే కేటాయింపులు కొనసాగుతున్నందున వాటినే కొనసాగించాలని కోరింది. 

811 టీఎంసీలను ఇండివిడ్యువల్ ప్రాజెక్టుల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందన్న ఏపీ.. రాష్ట్రాల లెక్కన 811 టీఎంసీల్లో నీటిని కేటాయించాలన్న తెలంగాణవాదన తప్పు అని వాదించింది. ఔట్​సైడ్ బేసిన్​కు తరలించే నీళ్లను కూడా ఇన్​బేసిన్ అలకేషన్ స్టేటస్ ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టం చేసిందని ఏపీ పేర్కొన్నది. 

నాగార్జునసాగర్ సహా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులపై ఉమ్మడి ఏపీలో నీటి కేటాయింపులపై జీవో ఇచ్చారని గుర్తు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు నాగార్జునసాగర్​లో 280 టీఎంసీలను తెలంగాణ, ఏపీలకు కేటాయించారని పేర్కొన్నది. అందులో ఏపీకి 174.3, తెలంగాణకు 105.7 టీఎంసీలు కేటాయించారని తెలిపింది. తెలంగాణ అడుగుతున్నట్టు దాన్ని మార్చడానికి లేదని వాదించింది.