కల్లూరు/కారేపల్లి/తల్లాడ/పెనుబల్లి/గుండాల, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు శుక్రవారం ఏకగ్రీవం అయ్యాయి. అందులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతూరు కల్లూరు మండలం నారాయణపురం కూడా ఉంది. సర్పంచ్, పది వార్డులకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలు అయ్యాయి.
మంత్రి పొంగులేటితో పాటు బీజేపీ జాతీయ నేత, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల సహా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సొంతూరు కూడా ఇదే. గతంలో కూడా నారాయణపురం గ్రామం సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమన్వయంతో..
ఈ ఏకగ్రీవానికి మంత్రి సోదరుడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. గ్రామంలోని అన్ని వర్గాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి అభిప్రాయ భేదాలను సర్దుబాటు చేసి ఏకాభిప్రాయాన్ని సాధించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటేశ్వర్లుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణపురం అభివృద్ధి పథంలో ఇది శుభ సూచికమని మంత్రి వ్యాఖ్యానించారు.
కారేపల్లి మండలంలోని 41 గ్రామపంచాయతీల్లో ఐదు జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మూడో విడత 17వ తేదీన జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కు శుక్రవారం నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. ఐదు జీపీల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. వీటిల్లో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్టు అధికారికంగా ప్రకటించడం లాంచనమే.
రెండు జీపీలు ఆదర్శం...
మండలంలోని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య స్వగ్రామమైన టేకులగూడెం గ్రామపంచాయతీ గత ఐదు పర్యాయాలుగా ఏకగ్రీవం కావడంతో పాటు ఈసారి సీపీఐఎంఎల్ మాస్ లైన్ మద్దతు తెలిపిన గుమ్మడి సందీప్ ను సర్పంచ్‌గా ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. 8 వార్డులను కూడా ఏకగ్రీవం చేసుకున్నారు.
దీంతోపాటు కొత్త కమలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ మద్దతు తో సర్పంచ్‌గా వడ్డే సులోచన ను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ రెండుచోట్ల గ్రామస్తులు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకొని ఆదర్శంగా నిలిచారు.
ఇక మండలంలోని కొత్త తండా, గిద్దవారిగూడెం, బోటి తండా గ్రామపంచాయతీల్లో కూడా ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఈ జీపీ లు ఏకగ్రీవం అయ్యాయి. కొత్త తండాలో ఆంజనేయ స్వామి గుడికి మూడు గుంటల స్థలం ఇవ్వడంతో పాటు ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ మహోత్సవాలు కూడా పూర్తి చేసి పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేసిన బీఆర్ఎస్ లీడర్ ధారావత్ మంగీలాల్ ను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోటితండా, గిద్దవారిగూడెం గ్రామాల్లో కూడా గుడి నిర్మాణాలకు ముందుకు వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పలు పంచాయతీలు..
తల్లాడ మండలం బస్వాపురం గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. మూడో విడత ఎన్నికలు జరిగే తల్లాడ మండలం శుక్రవారంతో నామినేషన్లు ముగిశాయి. ఆ గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్, సీపీఎం, ప్రధాన పార్టీల మద్దతుతో పాశం హైమావతి నామినేషన్ వేయగా పోటీగా ఇంకెవరూ నామినేషన్లు వేయలేదు. గ్రామంలో ఎనిమిది వార్డులు ఉండగా ఏడువార్డులు ఏకగ్రీవం అయ్యాయి.
ఇదే మండలం బిల్లుపాడు పంచాయతీలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ఎనిక కృష్ణవేణి, బీఆర్ఎస్ అభ్యర్థిగా రుద్రాక్ష లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల నాయకులు చర్చలు జరిపి కాంగ్రెస్ కు సర్పంచ్ ఐదు వార్డులు, బీఆర్ఎస్ కు ఉప సర్పంచ్ ఐదు వార్డులుగా ఇవ్వాలని నిర్ణయించగా, బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఉపసహరించుకునేందుకు అంగీకరించారు.
పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది. మూడో ఫేజ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో శుక్రవారం నామినేషన్ ల ప్రక్రియ ముగియడంతో గంగాదేవి పాడు గ్రామ పంచాయతీ ఎస్టీ జనరల్ రిజర్వు కాగా, మాలోత్ రాధ కృష్ణ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్ను పంచాయితీలో సర్పంచ్ గా కల్తీ రజితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో ఎన్డీ, మాస్ లైన్, సీపీఐ, సీసీఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బలంగా ఉన్నప్పటికీ ఏ పార్టీతో సంబంధం లేని ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేయగా, అన్ని పార్టీలు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి.
