
- ఇచ్చేందుకు ముందుకు రాని మిల్లర్లు..
- ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు
- రాష్ట్ర వ్యాప్తంగా 405 మిల్లుల్లో 19 లక్షల టన్నుల ధాన్యం నిల్వ
- ప్రభుత్వానికి అందని రూ. 3,924.89 కోట్లు
- 9 జిల్లాల్లోనే 12.78 లక్షల టన్నుల వడ్లు
యాదాద్రి, వెలుగు : వేల కోట్ల విలువైన ‘టెండర్ వడ్లు’ ఏడాది కాలంగా మిల్లుల్లోనే మూలుగుతున్నాయి. టెండర్లు పూర్తి చేసి ఏడాది గడిచినా వడ్లను మిల్లర్లు ఇవ్వడం లేదు.. టెండర్ దక్కించుకున్న సంస్థలు వడ్లను తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. తొమ్మిది జిల్లాల్లోని మిల్లర్ల వద్ద ఎక్కువ వడ్లు ఉన్నాయి.
క్వింటాల్‌కు రూ. 2,060
2022–-23 సీజన్‌లో సీఎంఆర్ కోసం మిల్లర్ల ఇచ్చిన వడ్లలో చాలా వరకు తిరిగి ప్రభుత్వానికి చేరలేదు. రాష్ట్రంలోని 1,983 మిల్లుల్లో మొత్తం 38.01 లక్షల టన్నుల వడ్లు నిల్వ ఉన్నాయి. దీంతో అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ ఈ వడ్లను వేలం వేసేందుకు నిర్ణయించి.. టెండర్లను ఆహ్వానించింది. టెండర్‌లో పాల్గొన్న సంస్థలు క్వింటాల్ వడ్లకు రూ. 1,700 చొప్పునే కోట్ చేశాయి.
అయితే క్వింటాల్‌కు రూ. 2,060 చెల్లించి రైతుల వద్ద కొన్న వడ్లను రూ. 1700 ఇవ్వలేమని టెండర్లను రద్దు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. గతేడాది ఫిబ్రవరిలో వడ్లను వేలం వేసేందుకు మరోసారి టెండర్లు పిలవగా.. గతంలో పాల్గొన్న సంస్థలే క్వింటాల్‌కు రూ. 2 వేల చొప్పున చెల్లిస్తామని కోట్ చేశాయి.
ఇందులో హిందూస్థాన్ ఎంటర్ ప్రైజెస్, మంచుకొండ ఆగ్రో టెక్ ఒక్కొక్కటి చొప్పున, కేంద్రీయ భండార్ నాలుగు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెసింగ్ రిటైలింగ్ కో ఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆరు లాట్లను దక్కించుకుంది.
మిల్లుల్లోనే రూ. 3,924.89 కోట్ల విలువైన వడ్లు
క్వింటాల్‌కు రూ. 2 వేల రేటుకు ఒప్పుకున్న ప్రభుత్వం.. మిల్లుల్లో ఉన్న వడ్లను యథాతథంగా మూడు నెలల్లో తీసుకొని డబ్బు చెల్లించాలని టెండర్లు దక్కించుకున్న సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. టెండర్ దక్కించుకున్న సంస్థలు మిల్లులను తనిఖీ చేయగా.. కొన్ని మిల్లుల్లో వడ్లు లేకపోగా, మరికొన్నింటిలో పాడైపోయిన వడ్లు కనిపించాయి.
దీంతో వడ్లకు బదులు క్వింటాల్‌కు రూ. 2,223 చొప్పున డబ్బు చెల్లించాలని టెండర్ సంస్థలు మిల్లర్లను కోరాయి. కొన్ని మిల్లులు డబ్బులు చెల్లించగా, మరికొన్ని చెల్లించలేదు. మిల్లులు చెల్లించిన డబ్బుల్లో... తమకు రావాల్సిన కమీషన్ తీసుకున్న సంస్థలు మిగతా సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాయి.
హిందూస్థాన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఒక్క బస్తాను కూడా లిఫ్ట్ చేయలేదు. మంచుకొండ ఆగ్రోటెక్ 2.37 లక్షల టన్నులు, కేంద్రీయ భండార్ 6.96 లక్షల టన్నులు, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెసింగ్ రిటైలింగ్ కో ఆపరేటివ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ 9.61 లక్షల టన్నులకు సంబంధించిన డబ్బును ప్రభుత్వానికి కట్టేశాయి.
ఇలా ఇప్పటివరకు 1,582 మిల్లుల్లోని 18.95 లక్షల టన్నుల వడ్లకు సంబంధించిన డబ్బు ప్రభుత్వానికి అందింది. మరో 405 మిల్లుల్లో 19.05 లక్షల టన్నుల వడ్లు ఉన్నాయి. 2022–-23 యాసంగి సీజన్ నాటి లెక్క ప్రకారం క్వింటాల్‌కు రూ. 2,060 చొప్పున మిల్లర్ల వద్ద ఉన్న వడ్ల విలువ రూ. 3,924.89 కోట్లు. ఇదిలా ఉండగా... కొన్ని మిల్లుల్లో అసలు వడ్లే లేవని తెలుస్తోంది.
9 జిల్లాల్లోనే ఎక్కువ
టెండర్ వడ్ల బకాయిలో తొమ్మిది జిల్లాలకు చెందిన మిల్లర్లే ఎక్కువగా ఉన్నారు. ఇందులో సూర్యాపేట జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ జిల్లాలో 69 మిల్లులకు 2.98 లక్షల టన్నుల వడ్లు ఇవ్వగా.. 58 మంది మిల్లర్లు 58.655 టన్నుల వడ్ల సొమ్ము చెల్లించారు.
మిగిలిన 11 మంది మిల్లర్ల వద్దే 2.39 లక్షల టన్నుల స్టాక్ ఉంది. వనపర్తిలో 106 మంది మిల్లర్లకు 2.22 లక్షల టన్నుల వడ్లు ఇవ్వగా.. 40 మంది 10.251 టన్నుల వడ్ల డబ్బు చెల్లించగా, మరో 66 మంది మిల్లర్లు 2.12 లక్షల టన్నులకు సంబంధించిన వడ్లు బకాయి పడ్డారు.
బకాయిలో టాప్ 9 జిల్లాలు
జిల్లా మిల్లులు నిల్వ ఉన్న వడ్లు (టన్నుల్లో..)
సూర్యాపేట 11 2,39,603
వనపర్తి 66 2,12,256
నిజామాబాద్ 97 1,70,964
నిర్మల్ 12 1,31,879
నల్గొండ 4 1,12,542
మెదక్ 24 1,11,830
నాగర్‌కర్నూల్ 19 1,11,396
కరీంనగర్ 11 93,965
జగిత్యాల 6 93,872