ఢిల్లీలో టెన్షన్ .. మళ్లీ వెలసిన ముండ్ల కంచెలు

ఢిల్లీలో టెన్షన్  ..  మళ్లీ వెలసిన ముండ్ల కంచెలు

ఢిల్లీ: హస్తినలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. 23 పంటలకు ఎంఎస్పీ అమలు చేయాలని, కేంద్రం నల్లచట్టాల రద్దు సమయంలో ఇచ్చిన హామీలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై కేంద్రంతో చర్చలు జరిపిన రైతు ప్రతినిధులు ఇవాళ ఉదయం 11 గంటల వరకు డెడ్ లైన్ పెట్టారు. అది దాటడంతో రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఢిల్లీ సరిహద్దులోని శంభు వద్ద ముండ్ల కంచెలు, బారికేడ్లు  ఏర్పాటు చేశారు. 

ఢిల్లీకి ప్రవేశించే రూట్లలో దాదాపు 40 వేల బారికేడ్లు వెలిశాయి. రైతుల ఆందోళన  నేపథ్యంలో కేంద్రం పలువురు రైతు నాయకుల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసింది. చలో ఢిల్లీ నేపథ్యంలో 1200 ట్రాక్టర్లతో సుమారు 14 వేల మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. ప్రతిఘటించి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తుండటంతో శంభు ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఢిల్లీ సరిహద్దు కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. 

చర్చలకు పిలిచిన కేంద్రం

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా రైతు ప్రతినిధులను ఇవాళ మరోమారు చర్చలకు ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు.  ఎంఎస్పీ, పంటల వైవిధ్యం, పంట వ్యర్థాల సమస్య, ఎఫ్‌ఐఆర్‌ వంటి అన్ని అంశాలపై ఐదో రౌండ్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శాంతిని కాపాడుకోవడం ముఖ్యమంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.