జూబ్లీహిల్స్ అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత

జూబ్లీహిల్స్ అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 అంబేద్కర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల గుడిసెలను  పోలీసుల సహాయంతో  కూల్చివేశారు జీహెచ్ఎంసీ,  రెవెన్యూ అధికారులు. కూల్చివేస్తున్న అధికారులు, సిబ్బందితపై స్థానికులు తిరగబడ్డారు. వాగ్వాదానికి దిగారు. తమ గుడిసెలను కూల్చివేయవద్దు అంటూ కాళ్లా వేళ్లా  ప్రాథేయపడుతున్నా పట్టించుకోకపోవడంతో ఆందోళనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు  ఆందోళనకారులను  అరెస్ట్ చేసి  స్టేషన్ కు తరలించారు. 
తమ గుడిసెలను తొలగిస్తే తాము ఎక్కడుండాలని ఆందోళనకారులు ప్రశ్నించారు. గత 35 ఏళ్లుగా.. ఒక తరానికి పైగా ఇక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నామని, ఎన్నికల సమయాల్లో తమకు  ఇండ్ల పట్టాలు  ఇస్తామని హామీ ఇచ్చారన్నారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు  డబుల్ బెడ్ రూం  ఇండ్లు ఇస్తామని  మాయ మాటలు  చెప్పి  స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను నిస్సహాయులుగా మార్చి రోడ్డున పడేస్తారా అంటూ కంటతడిపెట్టారు.