కరీంనగర్​లో హీటెక్కుతున్న ఎమ్మెల్సీ రాజకీయాలు

కరీంనగర్​లో హీటెక్కుతున్న ఎమ్మెల్సీ రాజకీయాలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడి రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకుందామని ఆశించిన టీఆర్ఎస్​కు సొంత పార్టీ లీడర్లు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన మాజీ మేయర్ సర్దార్​రవీందర్ సింగ్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి రోజుకో రకంగా రూలింగ్​పార్టీకి చుక్కలు చూపుతున్నారు. రెండు రోజుల కింద వారిద్దరూ సిటీలోని ఓ హోటల్ లో రహస్యంగా కలుసుకున్న ఫొటోలు తాజాగా లీకయ్యాయి. టీఆర్ఎస్​రెబల్స్​గా నామినేషన్లు వేసిన వీరిద్దరూ  కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతు కూడగడుతూనే రూలింగ్​పార్టీ క్యాంపుల్లోని ఓటర్లతో టచ్​లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. 

హోటల్ లో భేటీ 

కరీంనగర్​ లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండుస్థానాల నుంచి టీఆర్ఎస్​ తరుపున ఎల్​రమణ, భానుప్రసాద్​రావు బరిలో నిలిచారు. మరో 8 మంది ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు. వీరిలో మాజీ మేయర్​సర్దార్​రవీందర్​సింగ్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్​రెడ్డి టీఆర్ఎస్​శిబిరంలో కలకలం రేపుతున్నారు. వీరిద్దరిలో రవీందర్​సింగ్​కు కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో మంచి పరిచయాలు ఉండగా, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రభాకర్​రెడ్డికి ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో మంచి పట్టు ఉంది. దీంతో పాత పరిచయాల ఆధారంగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే రవీందర్​సింగ్, ప్రభాకర్ రెడ్డి శనివారం రహస్యంగా నగరంలోని ఓ  హోటల్ లో కలిశారు. తమకున్న పరిచాయలతో అందరినీ ఓట్లు అభ్యర్థించాలని, ఒక ఓటు నాకు, ఒక ఓటు నీకు పడేలా చూసుకోవాలని మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం పరిధిలో 1,324 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం 8 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉండగా, వీరికి ప్రపోజల్ చేసిన వారితో కలిపి  80మంది ఉన్నారని, విడివిడిగా   ఉంటే ఓట్లు భారీగా చీలిపోయే ప్రమాదం ఉన్నందున ఇండిపెండెంట్లంతా తమకు మద్దతు ఇచ్చేలా ఈ భేటీలో వ్యూహం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. 

రూలింగ్​పార్టీలో గుబులు.. ఇందుకేనా?

టీఆర్ఎస్​ అభ్యర్థుల్లో ఎల్​రమణ ఈ మధ్యే టీడీపీ నుంచి వలసరాగా,  భానుప్రసాద్​రావు ఒకప్పుడు కాంగ్రెస్​ నేత. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఉద్యమ సమయంలో పార్టీ జెండా మోసినవారు కాదు. వీరిద్దరికీ ఫీల్డ్​లెవల్​ టీఆర్ఎస్​ లీడర్లతో గానీ, ప్రస్తుత ఓటర్లతో గానీ ఎమోషనల్​ సంబంధాలు లేవు. కానీ రవీందర్​సింగ్​, ప్రభాకర్​రెడ్డి ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్​లో ఉండడంతో వారికి సానుభూతి కలిసివస్తుందనే భయం రూలింగ్​ పార్టీని వెంటాడుతోంది.  మరోవైపు నిధులు, విధుల కోసం కొట్లాడుతున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ తరుపున కౌన్సిల్​లో గట్టిగా మాట్లాడేవారు కావాలని కోరుకుంటున్నారు. గతంలో టీఆర్ఎస్​ హైకమాండ్​ప్రకటించిన అభ్యర్థులను గెలిపిస్తే వాళ్లు ఏనాడూ తమ తరుపున మాట్లాడలేదనే అభిప్రాయంతో ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్​ అభ్యర్థులిద్దరూ మాస్​లీడర్లు కాకపోవడంతో తమవైపున గొంతెత్తడం అనుమానమే అని ఓటర్లు భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కాగా, రవీందర్​సింగ్, ప్రభాకర్​రెడ్డి వీరిద్దరికీ పూర్తి భిన్నం. అందుకే టీఆర్ఎస్​ క్యాంపుల నుంచి కూడా పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు సింగ్‍ కు ఫోన్‍ చేసి మద్దతు ప్రకటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షునిగా పని చేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఈ విషయంలో ఇంకో అడుగు ముందే ఉన్నారు. నామినేషన్ వేయకముందే నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో కలిసి ఆయన ఏకంగా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో వాళ్లంతా సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పాకే నామినేషన్ వేశారు. అందుకే రూలింగ్​ పార్టీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నామినేషన్ విత్ డ్రా చేసుకోలేదు. ఇది కూడా వారికి కలిసి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు మిగితా జిల్లాలతో పోలిస్తే కరీంనగర్​లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇటీవల హుజూరాబాద్​ ఫలితమే ఇందుకు నిదర్శనం అని పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం రూలింగ్​ పార్టీ వేల కోట్లు ఖర్చు పెట్టినా ఓటుకు రూ.6వేల చొప్పున పంచినా చివరికి ఈటల రాజేందర్​ వైపే జనం మొగ్గుచూపారు. అందుకే తాము క్యాంపులుపెట్టినా, ఓటుకు ఇంత అని ముట్టజెప్పినా చివరకు ఓటర్లు ఏం చేస్తారోననే భయం టీఆర్ఎస్​ లీడర్లను వెంటాడుతోంది. 

పార్టీలకతీతంగా మద్దతు కూడగడ్తూ.. 

ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రెబెల్ గా  బరిలోకి దిగారు. ఆ వెంటనే టీఆర్ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడాయన పార్టీలకతీతంగా లీడర్లను కలిసి మద్దతు కోరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్​ లీడర్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ బాబును కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అడిగారు. త్వరలోనే బీజేపీ  నాయకులను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవీందర్​సింగ్​వరుసగా కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను నేరుగా కలుస్తూ తనకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి సైతం ఆదివారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. వీరిద్దరూ క్యాంపులోని టీఆర్ఎస్​ ఓటర్లతోనూ టచ్​లోకి వెళ్తున్నారనే వార్తలు రూలింగ్​పార్టీ అభ్యర్థుల్లో గుబులు రేపుతున్నాయి.