టీఆర్ఎస్ లీడర్లలో ఎమ్మెల్సీ బెర్తుల టెన్షన్

టీఆర్ఎస్ లీడర్లలో ఎమ్మెల్సీ బెర్తుల టెన్షన్
  • తక్కళ్లపల్లి, గుత్తాలకు కేసీఆర్ ‘కంగ్రాట్స్’
  • రెడీగా ఉండాలని ఇంకో ఐదుగురికి ఫోన్లు
  • గవర్నర్ కోటాలో అందుబాటులో ఒక సీటు
  • ఒకరికి కరీంనగర్ ‘స్థానిక’ టికెటిస్తారని చర్చ

హైదరాబాద్‌, వెలుగు: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాపై టీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ పెరిగిపోతున్నది. ఉన్న ఆరు సీట్లూ ఏకగ్రీవంగా 
టీఆర్ఎస్ పరమే కానుండటంతో చాన్సు కోసం నేతలంతా పోటీ పడుతున్నారు. దీంతో క్యాండిడేట్లను చివరి క్షణం దాకా ప్రకటించకుండా కేసీఆర్​ గోప్యత పాటిస్తున్నారు. అయితే ఆరింట్లో ఇద్దరి పేర్లు మాత్రమే సోమవారం ఖరారయ్యాయి. మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, వరంగల్‌కు చెందిన తక్కళ్లపల్లి రవీందర్‌ రావును కేసీఆర్ ఓకే చేశారని సమాచారం. సోమవారం సాయంత్రంలోపే అన్నింటినీ తేల్చేస్తారని ప్రచారమైనా రాత్రి పొద్దుపోయేదాకా ఏమీ తేలలేదు. మిగతా నలుగురిని మంగళవారం ఉదయం ఫైనల్‌‌ చేస్తారంటుండటంతో ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది. సిద్దిపేట కలెక్టర్‌‌ వెంకట్రామిరెడ్డి కూడా సోమవారమే ఐఏఎస్‌‌కు రాజీనామా చేసి రేసులోకి రావడంతో టెన్షన్‌‌ పీక్స్ కు చేరింది. చాన్సు దక్కుతుందా, చివరి నిమిషంలో తప్పిపోతుందా అని ఎవరికి వారు ఆందోళన చెందుతున్నారు.

ఎవరైతరో కరీంనగర్ ‘లోకల్’?

మండలి మాజీ చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డికి, టీఆర్ఎస్ లో ఆవిర్భావం నుంచి ఉన్న వరంగల్‌‌ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్‌‌ రావుకు కేసీఆర్‌‌ స్వయంగా ఫోన్​ చేసి అభినందించారని తెలుస్తోంది. కంగ్రాట్స్ చెప్పి, మంగళవారం నామినేషన్‌‌ వేయాలని సూచించారన్నది పార్టీ వర్గాల్లో టాక్. హుజూరాబాద్‌‌కు చెందిన పాడి కౌశిక్‌‌రెడ్డి, నాగార్జునసాగర్‌‌కు చెందిన ఎంసీ కోటిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎస్సీ కమిషన్‌‌ మాజీ చైర్మన్‌‌

ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు కూడా

‘నామినేషన్‌‌ వేయడానికి రెడీగా ఉండా’లంటూ ఫోన్లు వెళ్లాయంటున్నారు. కౌశిక్‌‌ రెడ్డిని ఆగస్టులోనే గవర్నర్‌‌ కోటాలో మండలికి నామినేట్‌‌ చేశారు. ఆయనపై కేసులుండటంతో గవర్నర్‌‌ ఆమోదించలేదు. కాబట్టి కౌశిక్ ను ఎమ్మెల్యేల కోటాకు, మిగతా ఆరుగురిలో ఒకరిని గవర్నర్‌‌ కోటాకు మారుస్తారంటున్నారు. మాజీ స్పీకర్‌‌ మధుసూదనాచారి పేరూ పరిశీలనకు వచ్చినా స్పష్టత లేదని సమాచారం. తాజా మాజీ ఐఏఎస్‌‌ వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే కోటాలో చాన్సిస్తే మిగతా వారిలో ఒకరిని లోకల్ బాడీస్ కోటాకు మార్చాల్సి ఉంటుంది. ఆయననే కరీంనగర్‌‌ లోకల్ బాడీస్ నుంచి పోటీ చేయించవచ్చని కూడా అంటున్నారు.

తెరపైకి కుల సమీకరణాలు

ఆరు ఎమ్మెల్సీ ఖాళీల్లో మూడింట్లో గతంలో బీసీలకు చాన్స్ దక్కింది. ఇప్పుడు ముగ్గురు రెడ్లు, ఒక వెలమ, ఇద్దరు ఎస్సీలను పంపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే మండలిలో పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులకు ప్రాతినిధ్యం లేదు. చట్టసభల్లో ఇప్పటిదాకా అడుగు పెట్టని కుమ్మరలకు, ఎంబీసీలకు చాన్సిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. హుజూరాబాద్‌ బై ఎలక్షన్ ముందు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎల్‌.రమణ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటాలో ఎక్కువ సీట్లు అగ్రవర్ణాలకిస్తే బీసీల నుంచి వ్యతిరేకత ఎదురు కావచ్చంటున్నారు. ఇన్ని కాలిక్యులేషన్స్ మధ్య జాబితా ప్రకటన లేటైందని టీఆర్ఎస్ నేతలంటున్నారు.