పాక్‌‌‌‌ బాటలో బంగ్లాదేశ్‌‌‌‌.. బీసీసీఐతో కయ్యానికి కాలుదువ్వుతున్న బంగ్లా బోర్డు

పాక్‌‌‌‌ బాటలో బంగ్లాదేశ్‌‌‌‌.. బీసీసీఐతో కయ్యానికి కాలుదువ్వుతున్న బంగ్లా బోర్డు
  • ఇండియాతో క్రికెట్ సంబంధాలు రద్దయితే  ఆ దేశానికే దెబ్బ

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌): ఆసియా క్రికెట్‌‌‌‌లో మరో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉండి గ్రౌండ్‌‌‌‌లోపలా.. బయటా మంచి సంబంధాలు కొనసాగించిన ఇండియా, బంగ్లాదేశ్ మధ్య  ఇప్పుడు అగాధం ఏర్పడింది. అటు ప్రభుత్వంతో ఇటు బీసీసీఐతో  కయ్యానికి కాలుదువ్వుతున్న బంగ్లాదేశ్..  క్రికెట్ ప్రపంచంలో  ‘మరో పాకిస్తాన్’లా ఏకాకిలా అయ్యే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

 బంగ్లాదేశ్‌‌‌‌లో జరిగిన రాజకీయ మార్పులు, హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్‌‌‌‌లో ఆడకుండా బహిష్కరించడంతో ఈ వివాదం ముదిరింది. షారూక్ ఖాన్‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ముస్తాఫిజుర్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేయడం.. అతడిని ఆడిస్తే ఈడెన్ గార్డెన్స్‌‌‌‌ పిచ్‌‌‌‌ను తవ్వేస్తామంటూ వచ్చిన హెచ్చరికల ఒత్తిడి కూడా బీసీసీఐ నిర్ణయానికి కారణం అయ్యాయి. 

అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే జరగబోయే పరిణామాలు తెలిసి కూడా బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఇండియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో పాల్గొనబోదని చెప్పడం, తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించి దెబ్బకు దెబ్బకు అనేలా  స్పందించింది. కానీ, బీసీసీఐని రెచ్చగొట్టే రీతిలో తీసుకున్న ఈ నిర్ణయాలు ఆ దేశ క్రికెట్‌‌‌‌నే సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి. 

మిత్ర దేశం నుంచి..శత్రు వైఖరి వైపు

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ఇండియా–-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలు స్వర్ణయుగాన్ని చూశాయి. 2019లో ఈడెన్ గార్డెన్స్‌‌‌‌లో జరిగిన చారిత్రాత్మక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌‌‌‌కు ఇరు దేశాల ప్రధానులు హాజరవడం ఆ సత్సంబంధాలకు నిదర్శనం. కానీ,  2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌‌‌‌లో జరిగిన రాజకీయ మార్పులు, ఆ తర్వాత హిందూ మైనారిటీలపై జరిగిన దాడులు మొత్తం సీన్‌‌‌‌ను మార్చేశాయి.

 ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీరు, మైదానంలో ఆ దేశ ఆటగాళ్ళ ప్రవర్తన, అక్కడి ప్రేక్షకుల వైఖరి.. అన్నీ ఇండియా పట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ శత్రుపూరిత వాతావరణమే ఇప్పుడు క్రికెట్ సంబంధాలకు ఎసరు పెడుతోంది. దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, దాని మొదటి ప్రభావం క్రికెట్ మీదే పడుతుందనేది ఇప్పుడు మరోసారి రుజువైంది.  

బంగ్లాలో పరిస్థితులు, స్వదేశంలో రాజకీయ ఒత్తిళ్ల మధ్య బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా  ముస్తాఫిజుర్‌‌‌‌‌‌‌‌ రహమాన్‌‌‌‌ కాంట్రాక్ట్ రద్దు చేసింది. ఇది పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి నిషేధించిన సందర్భాన్ని గుర్తుచేస్తోంది. దీని ద్వారా ‘దేశ గౌరవం  తర్వాతే ఆట’ అనే బలమైన సందేశాన్ని బీసీసీఐ  ప్రపంచానికి పంపింది.

బీసీసీతో పెట్టుకుంటే పాక్ గతేనా?

బీసీసీఐ నిర్ణయం వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. ఇది తమ దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా చిత్రీకరిస్తూ.. బంగ్లాదేశ్‌‌‌‌లో ఐపీఎల్  ప్రసారాలపై నిరవధిక నిషేధం విధించింది.   రాబోయే టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో.. ఇండియా‌‌‌‌లో జరిగే తమ మ్యాచ్‌‌‌‌లను తటస్థ వేదికకు (శ్రీలంకకు) మార్చాలని ఐసీసీని కోరింది. అయితే,  భద్రతా కారణాలకు సరైన సాక్ష్యాలు లేకుండా వరల్డ్ కప్ మ్యాచ్‌‌‌‌లను బహిష్కరిస్తే.. ఐసీసీ పాయింట్ల కోత విధించడమే కాకుండా, భారీ జరిమానాలు, నిధుల కోత వంటి చర్యలు తీసుకునే ప్రమాదం ఉంది.  

ఇండియాలో ఆడేందుకు మొండిగా నిరాకరిస్తే.. బీసీసీఐ పాకిస్తాన్ మాదిరిగా బంగ్లా  బోర్డుతో సంబంధాలు తెంచుకోవడం ఖాయం. ప్రపంచ క్రికెట్‌‌‌‌లో పెద్దన్న లాంటి ఇండియా బోర్డుతో గొడవ పెట్టుకొని ఇరు దేశాల సిరీస్‌‌‌‌లను నిర్వీర్యం చేయడం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకోవడమే అవుతుంది. బంగ్లాక్రికెట్ బోర్డు ఆదాయంలో సింహభాగం టీవీ ప్రసార హక్కుల  నుంచే వస్తుంది. ఇండియాతో సిరీస్ ఉంటే ఆ రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. 

ఒకవేళ ఇండియా  బంగ్లాతో సిరీస్‌‌‌‌లను రద్దు చేసుకుంటే, బీసీబీ ఆదాయం సగానికి పైగా పడిపోతుంది. ఇండియా లేని సిరీస్‌‌‌‌లకు బంగ్లాదేశ్‌‌‌‌లో స్పాన్సర్లు దొరకడం కష్టం. ఇది బంగ్లాలో క్రికెట్ అభివృద్ధిని, ఆటగాళ్ళ జీతాలు, జీవితాలనే తీవ్రంగా దెబ్బతీయనుంది.

మన బోర్డు నిర్ణయం సరైనదేనా?  

ముస్తాఫిజుర్ విషయంలో బీసీసీఐ నిర్ణయాన్ని రెండు కోణాల్లో చూడాలి. కేవలం క్రీడా కోణంలో చూస్తే.. రాజకీయ కారణాలతో ఒక ప్రతిభావంతుడైన ఆటగాడిని దూరం చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం. కానీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, బంగ్లాలో ఇండియన్స్‌ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటే.. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ తీసుకున్నది ముందు జాగ్రత్త చర్యగానే కనిపిస్తోంది. ఒకవేళ ఇక్కడ ఆటగాడికి ఏదైనా చిన్న అపశ్రుతి జరిగినా, అది రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి దారితీసే ప్రమాదం ఉంది.  ఏదేమైనా- రాజకీయాల చదరంగంలో క్రికెట్ ఎంతో కొంత నష్టపోతోందని అనేది మాత్రం నిజం. 

బంగ్లాలో ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్‌‌‌‌

ఇండియా–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో బంగ్లాలోని మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో ఐపీఎల్  ప్రసారాలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్ నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌‌‌‌ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించడాన్ని నిరసిస్తూ ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కారణం లేకుండా ముస్తాఫిజుర్‌‌‌‌ను పక్కన పెట్టడం తమ దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసిందని, అందుకే ఐపీఎల్ టెలికాస్ట్‌‌‌‌ను నిలిపివేయాలని సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.