
ట్యాంక్ బండ్, వెలుగు: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా వీరోచిత పోరాటం చేసిన భారత సైనికులకు ప్రజలందరూ జై కొట్టాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం ఏర్పడిన నాటినుంచి భిన్నత్వంలో ఏకత్వంగా భారత్ ఉందని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ మూలన ఉన్నా కూకటివేళ్లతోసహా అణచివేయాలని అన్నారు. దేశ ఐక్యమత్యాన్ని మనమంతా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని పురస్కరించుకొని సైనికులకు సంఘీభావంగా ‘సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఫోరం’ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి సెక్రటేరియెట్ మీదుగా వివేకానంద స్టాచ్యూ వరకు తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి, జమ్మూ కాశ్మీర్ రిటైర్డ్ డీజీలు రాజేంద్ర కుమార్, గోపాల్ రెడ్డి, సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కృష్ణారెడ్డి, లెఫ్టినెంట్ జనరల్ రవి ప్రసాద్, నారాయణన్, మేజర్ జనరల్ రజత్, శ్రీనివాసరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఇప్పుడు పీవోకే పై మాత్రమే చర్చ జరుగుతున్నదని చెప్పారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా జోక్యం అవసరం లేదని, మన సమస్యను మనమే పరిష్కరించుకోగలుగుతామని తెలిపారు. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దేశ రక్షణకు ప్రతీకలుగా నిలిచే 200 మంది మిలిటరీ అధికారులతో పాటు ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్, ఆర్. కృష్ణయ్య, ఎమ్మెల్యేలు రామారావు, ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య తదితరులు
పాల్గొన్నారు.
మోదీ సమయస్ఫూర్తితో వ్యవహరించారు: కిషన్‌రెడ్డి
పాక్‌తో ఉద్రిక్తతల సమయంలో ప్రధాని మోదీ సమయస్ఫూర్తితో వ్యవహరించారని కిషన్‌రెడ్డి కొనియాడారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేశామని, కానీ ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ పై దాడులకు ఉసిగొల్పుతున్నదని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ తో చర్చ జరపాలంటే అది కేవలం ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదం పైన మాత్రమే జరగాలని అన్నారు.