కాల్పుల విరమణ ఒప్పందం రద్దు.. పాక్, ఇంగ్లండ్ సిరీస్కి పొంచి ఉన్న ముప్పు

కాల్పుల విరమణ ఒప్పందం రద్దు.. పాక్, ఇంగ్లండ్ సిరీస్కి పొంచి ఉన్న ముప్పు

17 ఏండ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ టీంకి గుబులు పట్టుకుంది. పాక్ ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ – ఏ – తాలిబన్ అక్కడి ప్రభుత్వంతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది కాస్తా ఇంగ్లండ్ టీం పర్యటనపై ప్రభావం చూపనుంది. ఉగ్ర సంస్థ ప్రకటనతో పాకిస్తాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంగ్లండ్ క్రికెటర్ల భద్రత మరింత కట్టుదిట్టం చేసింది. వారు బసచేసిన హోటల్స్ తో పాటు స్టేడియాల వద్ద భారీగా బలగాలను మోహరించింది.    

2009లో శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ ఘటన తర్వాత పాకిస్తాన్ లో క్రికెట్ ఆడేందుకు ఏ దేశ క్రికెట్ బోర్డ్ ముందుకు రాలేదు. గతేడాది కూడా భద్రతా కారణాల వల్ల న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే పాక్ లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు ముందుకొస్తున్నాయి. అయితే ఇంగ్లండ్ టీం పాక్ గడ్డపై అడుగుపెట్టిన మరునాడే ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ ప్రభుత్వంతో జూన్ లో జరిపిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం మళ్లీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పాకిస్తాన్ లో ఇస్లాం మతాన్ని కఠినంగా అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉగ్రవాద సంస్థ, దేశమంతా దాడులు చేయాలని ఉగ్రవాదులకు ఆదేశాలు జారీ చేసింది. రావల్పిండి వేదికగా డిసెంబర్ 1న ప్రారంభం కాబోయే పాకిస్తాన్, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.