మా సహనాన్ని ప​​​​​​​రీక్షించకండి.. లేదంటే ప్రతిదాడికి సిద్ధంగా ఉండండి: పాక్‎కు మంత్రి రాజ్‎నాథ్ సింగ్ వార్నింగ్

మా సహనాన్ని ప​​​​​​​రీక్షించకండి.. లేదంటే ప్రతిదాడికి సిద్ధంగా ఉండండి: పాక్‎కు మంత్రి రాజ్‎నాథ్ సింగ్ వార్నింగ్

న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం (మే 8) ఢిల్లీలో జరిగిన నేషనల్ క్వాలిటీ కాన్క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సహనాన్ని పరీక్షించవద్దని పాకిస్థాన్‎ను హెచ్చరించారు. భారత్‎ను రెచ్చగొడితే.. ఆపరేషన్ సిందూర్ వంటి నాణ్యమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలని దాయాది దేశానికి వార్నింగ్ ఇచ్చారు.

‘‘మేము ఎల్లప్పుడూ బాధ్యతాయుతమైన దేశంగా చాలా సంయమనంతో వ్యవహరించాము. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని మేము నమ్ముతాం. కానీ ఎవరైనా మా సహనాన్ని పరీక్షిస్తే ఉపేక్షించం. భారత్ రెచ్చగొట్టే వారు ఆపరేషన్ సిందూర్ వంటి కౌంటర్ ఎటాక్‎కు రెడీగా ఉండాలి’’ అని రాజ్‎నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. 

పహల్గాం దాడికి కౌంటర్‎గా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎లో మన సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్యానికి వారిని అభినందిస్తున్నానని అన్నారు. పాకిస్తాన్, పీఓకెలోని ఉగ్రవాద శిబిరాలను మన భద్రతా దళాలు నాశనం చేసిన విధానం మనందరికీ గర్వకారణమన్నారు. ఆపరేషన్ సిందూర్‎లో భాగంగా పాకిస్తాన్, పీఓకెలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం చేశామని.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. 

►ALSO READ | ఇండియా దాడి తీవ్రతరం చేసింది.. లాహోర్ను వదిలి వెళ్లండి.. అమెరికా హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ ఊహించలేని ఖచ్చితత్వంతో అమలు చేయబడిందని.. ఈ ఆపరేషన్ అమాయకులకు ఎటువంటి హాని జరగకుండా నిర్వహించబడిందని క్లారిటీ ఇచ్చారు. ఈ విజయానికి భారత సాయుధ దళాల వృత్తి నైపుణ్యం, అత్యాధునిక యుద్ధ  పరికరాలే కారణమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. పీవోకేలోని ఉగ్రవాదులను ఏరి వేస్తున్నామని తెలిపారు. మా దేశ సారభౌమత్వాన్ని సవాల్ చేస్తే ఊరుకోమని.. దాడులకు ప్రతిదాడులు తప్పవని భారత దేశ వైఖరిని స్పష్టంగా చెప్పారు.