
ఆపరేషన్ సిందూర్ పేరున పాకిస్తాన్ పై భారత్ దాడిని తీవ్రతరం చేసింది. పాక్ లోని టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ.. గురువారం పాకిస్తాన్ లోని కీలక ప్రాంతాలపై డ్రోన్స్ తో విరుచుకుపడింది. లాహోర్, కరాచీ, రావల్పండి ప్రాంతాలలో డ్రోన్స్ దాడిని తీవ్రతరం చేసింది.
లాహోర్ లోని చైనా-పాక్ సంయుక్తంగా తయారు చేసిన HQ-9 డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. రావల్పండి స్టేడియంపై డ్రోన్ దాడి చేయడంతో పాక్ లో అలజడి మొదలైంది. అంతే కాకుండా పాక్ బార్డర్ లోని (PoK) టెర్రర్ క్యాంపులను మరోసారి ధ్వంసం చేశామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం (మే 8) ప్రకటించారు.
ఆపరేషన్ సిందూర్ కు బదులు తీర్చుకోవాలని పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఇండియాలోని పలు ప్రాంతాలపై బుధవారం రాత్రి (మే7) మిస్సైల్, డ్రోన్స్ దాడికి దిగడంతో భారత్ మరుసటి రోజే బదులిచ్చింది. బుధవారం రాత్రి పంజాబ్, జమ్మూ కశ్మీర్ లోని 15 ఆర్మీ బేస్ క్యాంపులే లక్ష్యంగా మిస్సైల్, డ్రోన్స్ తో దాడికి దిగింది పాక్. దీనికి బదులుగా గురువారం (మే 8) లాహోర్, కరాచీ, రావల్పండి ప్రాంతాలలో డ్రోన్స్ దాడిని తీవ్రతరం చేసింది ఇండియా.
ఇండియా దాడిని తీవ్రతరం చేసిన క్రమంలో పాకిస్తాన్ లో ఉన్న యూఎస్ ఎంబసీ లోని ఉద్యోగులను, పౌరులను ఖాలీ చేసి వెళ్లి పోవాల్సిందిగా అమెరికా హెచ్చరించింది. లాహోర్ ను వదిలి వెళ్లాలని, లేదంటే ఏదైనా సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలని సూచించింది.
లాహోర్ సిటీపై డ్రోన్స్, బాంబుల దాడులతో యూఎస్ ఎంబసీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. లాహోర్ లో ఉన్న యూఎస్ కాన్సులేట్ జనరల్.. యూఎస్ పౌరులు, ఉద్యోగులు లాహోర్ వదిలి వెళ్లిపోవాల్సిందిగా గురువారం హెచ్చరించారు.