V6 News

ఏప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు.. జూన్ 15 నుంచి 30 మధ్య ఆన్లైన్ ఎగ్జామ్స్

ఏప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు.. జూన్ 15 నుంచి 30 మధ్య ఆన్లైన్ ఎగ్జామ్స్
  • ఏప్రిల్30 వరకు ఫీజు చెల్లింపునకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుంది. సోమవారం (ఏప్రిల్ 13)  టీజీటెట్ షెడ్యూల్, నోటిఫికేషన్​ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ రిలీజ్ చేశారు. బుధవారం నుంచి  ఈ నెల 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. 

జూన్‌ 15 నుంచి 30 మధ్యలో ఆన్‌లైన్‌ లో పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అభ్యర్థులు జూన్‌ 9 నుంచి  హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో ఉదయం 9గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటాయని చెప్పారు.

 జనరల్‌, బీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్​కు రూ.700,  రెండు పేపర్లకు రూ.950గా నిర్ణయించారు. పరీక్ష ఫలితాలను జులై 28 నుంచి 31 తేదీల మధ్యలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

  • అర్హత మార్కులు, వెయిటేజీ..

టెట్‌లో జనరల్‌ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. టీచర్ రిక్రూట్​మెంట్ టెస్టు (టీఆర్‌టీ)లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని  సూచించారు.